Exchange of 500 1000 rupees notes with Changeపెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుప్పకూలాయి. కోట్ల లావాదేవీలు జరిగే రియల్ ఎస్టేట్ రంగం నుండి రోజు వారీ పచారీ సరుకులు అమ్మే షాపుల వరకు అన్నీ సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాలు అయితే ఇప్పట్లో కోలుకునే దశలో లేదని నిపుణులు తేల్చేస్తున్నారు. అలాగే సినిమా, రవాణా రంగాలపై కూడా పెను ప్రభావితం చూపుతోందన్న విషయం స్పష్టమవుతోంది. పెద్ద నోట్లకు సరిపడా చిల్లర దొరకక అన్ని రంగాలు సతమతమవుతున్న దశలో ఒక బిజినెస్ మాత్రం దూసుకుపోతోంది.

“పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేకుండా దేశంలో ఒకే ఒక్క వ్యాపార విభాగం ముందుకు సాగుతోందని, అది మరేదో కాదు, మద్యం వ్యాపారమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే… ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో నిలవడం విశేషం. దీనికి ప్రధాన కారణం… మద్యం వ్యాపారంలో ఉన్న వారు తమ అమ్మకాలను పెంచుకునేందుకు పాత నోట్లను స్వీకరించడమేనని” తెలుస్తోంది. ఈ కారణంగానే మద్యం “మూడు ఫుల్స్… ఆరు పెగ్గులు” మాదిరి కళకళలాడుతోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు… రాష్ట్రంలో నిత్యమూ కోటి మంది మద్యం సేవిస్తూ, ఒక్కొక్కరు సగటున 30 రూపాయలను అదనంగా చెల్లిస్తున్నారని, రోజుకు 3 కోట్లు, నెలకు 90 కోట్ల నల్లధనం చేతులు మారుతున్నాయని అన్నారు. లిక్కర్ వ్యాపారంలో నల్లధనం ప్రవహిస్తోందని అంగీకరించిన సోము వీర్రాజు, పెద్ద నోట్ల రద్దుతో ఈ రంగంపై ప్రభావం ఉండదని, దీని నియంత్రణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.