MP KP Reddaiah Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని వరదాప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి తండ్రి కేపీ రెడ్డెయ్య పామర్రు వద్ద పవన్ కళ్యాణ్ ‌ని కలవడం విశేషంగా మారింది.

ఈ కలయికకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని… రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా ఇది జరగడం విశేషం. అధికారంలో ఉన్న వారి దృష్టికి తీసుకురాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిని కలవడం ఏంటి అని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రైతుల కష్టాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదన్నారు. తుపాను దెబ్బకి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రభుత్వాలు అంచనాలతో సరి పెట్టడమే తప్ప.. ఆదుకోవడం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.

మరోవైపు ఉయ్యూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పవన్‌ వెంట వెళ్తున్న జనసేన కార్యకర్తల బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జనసేన కార్యకర్తలు గాయలపాలయ్యారు. దీంతో స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని సమాచారం.