EVM ready for countingసార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు మొదలు కాబోతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరఫున ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు వెంటనే ఆయా పార్టీల అధినేతల ఇళ్లు, కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉంది. దీనితో అధినేత కార్యాలయాల వద్ద, ఇళ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

ఈరోజు రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఏపీఎస్‌పీ)కి చెందిన రెండేసి కంపెనీలు పహరా కాస్తాయి. స్థానిక పోలీసులు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అభ్యర్థులు గెలుపొందిన వెంటనే నేరుగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తరలివస్తే వారందరిని నియంత్రించటం స్ధానిక పోలీసులకు కష్టమవుతుందని ఏపీఎస్‌పీ పోలీసులను భద్రత విధులకు తీసుకున్నారు.

ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. మరోవైపు కౌంటింగుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి. ఎన్నికల కోడ్‌ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకూ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగు సెంటర్ల వద్ద భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత సెన్సిటివ్ రాష్ట్రంగా ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ను గుర్తించింది.