EVM Machines troubling in Andhra Pradesh Elections 2019దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం నుండి మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ మొదలయ్యే సమయానికే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంలు మొరాయించాయి. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని మీడియా సంస్థల కధనాలు. దాదాపుగా 2000 ఈవీఎంలు మొరాయించాయని వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఇంజినీర్లను తీసుకుని వచ్చి వాటిని రిపేర్ చేయిస్తున్నారు. కొన్ని చోట్ల వాటిని రీప్లేస్ చేస్తున్నారు. అయితే దీని వల్ల ఓటింగు చాలా చోట్ల రెండు మూడు గంటలు ఆలస్యంగా మొదలయ్యింది. దీనితో చాలా సేపు క్యూ లైన్ లలో నిలిచిపోవాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల టీడీపీకి ఓటు వేస్తుంటే వైకాపాకు, బీజేపీకి ఓట్లు పడుతున్నాయని ఆ పార్టీ వారు ఆరోపిస్తున్నారు.

చాలా చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్ దాడులకు దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాడిపత్రి, ఆళ్ళగడ్డ. వినుకొండ, సత్తెనపల్లి, రాప్తాడు వంటి చోట్ల దాడులకు తెగబడ్డారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద దాడి చెయ్యడం విశేషం. పోలింగ్‌ సరళి పరిశీలనకు వచ్చిన కోడెలపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. కోడెల చొక్కా చింపేశారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని చితకబాదారు. ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో భూమా నాగ మౌనిక కారుపైకి రాళ్లు రువ్విన గంగుల వర్గీయులు. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.