Everything is Jagan No Value For YSRCP Leadersవచ్చే ఎన్నికలలో ఏపీలో 175 సీట్లు మావే అని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని అందరికీ తెలుసు. ఆయన తీరు, ఆలోచనలు, నిర్ణయాలతో నానాటికీ ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని టీడీపీ, జనసేనలను విమర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియదనుకోలేము. బహుశః అందుకే పార్టీలో అందరినీ ఉత్సాహపరిచేందుకు జగన్‌175 సీట్లు మనవే అని చెప్పుకొంటున్నారేమో?

‘ప్రభుత్వం, పార్టీ అంటే జగన్‌ మాత్రమే’ అనే వ్యక్తి పూజస్థాయికి మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను తెచ్చేసి ఎవరికీ సొంతంగా గుర్తింపు, గౌరవం లేకుండా చేశారని చెప్పవచ్చు. అందుకే మంత్రులు సైతం “మేమందరం అనామకులం… ప్రజలు మమ్మల్ని, మా పనితీరుని చూసి కాదు… మా జగనన్న ఫోటో చూసి మమ్మల్ని గెలిపిస్తారని” నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. పార్టీలో అందరినీ అనామకులుగా… సొంతంగా గెలవలేనివారిగా మార్చేయడం వలన అందరూ తప్పనిసరిగా తనకు విధేయులుగా ఉండేలా జగన్‌ మార్చేసుకొన్నారు.

దీని వలన తమ అధినేత జగన్‌ మరింత బలపడుతుంటే తాము మరింత బలహీనపడుతున్నామని పార్టీలో ఎవరూ గుర్తించిన్నట్లు లేదు. ఒకవేళ గుర్తించినా ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి చేరుకొన్నందున అధినేత భజన చేస్తూ కాలక్షేపం చేయక తప్పదని చేస్తున్నారేమో?

ఒకవేళ జగనన్న భజన చేయకపోతే ఏమవుతుందో తెలుసుకొనేందుకు కోటంరెడ్డి, ఆనంరెడ్డి, మేకపాటి కళ్ళ ముందే ఉన్నారు. అందుకే మూడు రాజధానులు, భోగాపురం విమానాశ్రయం తదితర అంశాలపై బొత్స సత్యనారాయణ వంటి అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు సైతం తమ అధినేత వైఖరికి అనుగుణంగా మాట్లాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఒక పార్టీని స్థాపించి నిర్మించుకొని అధికారంలోకి తీసుకురావడం ఎంతో కష్టం. జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేసి చూపారు. కానీ తన విచిత్ర ధోరణితో తన సైన్యాన్ని తానే బలహీనపరుచుకొంటూ, ఎంతో కష్టపడి నిర్మించుకొన్న వైసీపీ సామ్రాజ్యాన్ని స్వయంగా తనే కూల్చివేసుకొంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ కోట కూలిపోతే, దానిలో కూర్చొని మిడిసిపడుతూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో?