YSR Congressవైసీపీ నేతలు టిడిపి, జనసేనలు ఎదురుదెబ్బలు తింటున్నాయని చెప్పేందుకు తరచూ వాడే పదం దేవుడి స్క్రిప్ట్! కానీ ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ వారికి కూడా వర్తిస్తున్నట్లుంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీస్ జారీ చేసి హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో ఈనెల 28న విచారణకి హాజరుకావాలని ఆదేశించింది. దాదాపు నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతున్నా ఈప్పటివరకు ఒక్కసారి కూడా సీబీఐ అవినాష్ రెడ్డిని ప్రశ్నించే సాహసం చేయలేకపోయింది. కానీ ఈ కేసు విచారణ హైదరాబాద్‌కి బదిలీ కాగానే మొట్టమొదట ఆయనకే నోటీస్ పంపించింది!

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్ర నేటికీ జైల్లోనే ఉన్నారు. మరో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ఇదే కేసులో సీబిఐ ఛార్జ్ షీటులో టైమ్ బాంబులా ఉండనే ఉంది. అదెప్పుడు పేలుతుందో తెలీదు.

ఈ కేసులన్నీ జమ్మిచెట్టుమీద ఉంచిన పాండవుల అస్త్రాల వంటివే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు తెలంగాణ రాజకీయాలతో గట్టిగా ముడిపడి ఉన్నందున కనుక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాటిని ముందుకు కదిలిస్తుందో… వైసీపీలో ఇంకా ఎంత మంది పేర్లు బయటకి వస్తాయో తెలీదు.

టిడిపి-జనసేనలు పొత్తులు పెట్టుకోకూడదని వైసీపీ దేవుడికి మ్రోక్కని రోజు లేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తులు ఖాయమని తేల్చి చెప్పేస్తున్నారు.

అప్పుడే జనవరి 27వ తేదీ వచ్చేసింది. అంటే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించాల్సిన సమయం… వాటి కోసం సిఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరాల్సిన సమయం! ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఈ నెల జీతాలు ఆలస్యమైతే వారు మరిక ఆలస్యం చేయకపోవచ్చు. అలాగని వారికి ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు, డీఏ బకాయిలు చెల్లించలేదు. కనుక ఇదీ పెద్ద సమస్యే!

జీతాల సమస్య ఎప్పుడూ ఉండేదే… కానీ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ లోపలవేస్తే పెను ప్రమాదం. కనుక దాని కోసమైనా అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలవక తప్పదు.

టిడిపిని కేసులతో, జీవోలతో అణచివేశామని వైసీపీ ప్రభుత్వం భావించిన ప్రతీసారి అది గోడకి కొట్టిన బంతిలా మరింత వేగంగా, శక్తివంతంగా దూసుకువస్తోంది. కొద్ది సేపటి క్రితం కుప్పంలో మొదలైన నారా లోకేష్‌ పాదయాత్ర ఇందుకు తాజా నిదర్శనం. నారా లోకేష్‌ పాదయాత్రని మంత్రులు ఎంతగా తీసిపారేస్తున్నప్పటికీ వారి గుండెల్లో గుబులు వారి మాటల్లో వినబడుతూనే ఉంది.

ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి దేవుడి ఆశీర్వచనాలు కాదు… దేవుడి స్క్రిప్ట్ సిద్దం చేసిపెట్టిన్నట్లే అనిపిస్తోంది కదా?