everyone-can-understand-ntr-nannaku-prematho-movieసుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “నాన్నకు ప్రేమతో” అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, మరికొద్ది గంటల్లో ఫస్ట్ ప్రీమియర్ షోకు ముస్తాబవుతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో 25వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకున్న సినిమా పబ్లిసిటీ విషయంలో జూనియర్ అందరి కంటే ముందున్నాడు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో “నాన్నకు ప్రేమతో” సినిమా కధ గురించి దాదాపుగా మొత్తం చెప్పేసారు. “ఈ సినిమా కధ కొత్తదని తానూ చెప్పను గానీ, సుకుమార్ స్టైల్లో కధనం కొత్తగా ఉంటుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కు ఓ మైండ్ గేమ్ జోడించి, “అందరికీ అర్థమయ్యేలా” సుకుమార్ తీర్చిదిద్దారని, ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, అలాగే, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఎక్స్ ట్రా సన్నివేశాలు గానీ, ఫైట్లు గాని, ప్రేక్షకులను పక్క దారి పట్టించడం గానీ ఉండదని, అదే ట్రైలర్ ద్వారా చెప్పామని” జూనియర్ చెప్పిన సినిమా సంగతులు అభిమానులకు కాస్త స్పష్టతను ఇచ్చినట్లే చెప్పవచ్చు.

“చివరి 45 నిముషాలు కధ చాలా ఎమోషనల్ గా సాగుతుందని, లండన్ లో ఉండే ఎన్నారైగా తన పాత్ర ఉంటుందని, నాన్న చివరి కోరిక తీర్చే పాత్రలో ఒక వైవిధ్యమైన ఎమోషన్ ఉంటుందని, తానూ ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించలేదని” చెప్పిన జూనియర్ “నాన్నకు ప్రేమతో” విజయవంతం అవుతుందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన గత చిత్రం “1 నేనొక్కడినే” చాలా మంది ప్రేక్షకులకు అర్ధం కాకపోవడంతో, జూనియర్ ప్రత్యేకించి “నాన్నకు ప్రేమతో” సినిమాను అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పినట్లున్నారు.

భారీ స్థాయిలో విడుదల కానుండడంతో తొలి రోజు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతాయనే అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దాహార్తిని “నాన్నకు ప్రేమతో” సినిమా తీర్చేస్తుందో లేదో యుఎస్ లో పడబోయే ఫస్ట్ ప్రీమియర్ షో చెప్పేయనుంది. ఏపీ, తెలంగాణాలలో మొదటి ఆట 13వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శితమవనుంది.