Rahul Gandhiతెలంగాణ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తారని తెలియగానే మొట్ట మొదట అప్రమత్తమైన వ్యక్తి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. అప్పటి నుంచి ఆయన డేంజర్ బెల్ మ్రోగిస్తునే ఉన్నారు కానీ నేటికీ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ అధిష్టానం మేల్కొన్నట్లు లేదు.

కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకి సమాన దూరం పాటిస్తామని చెపుతున్నారు. కానీ ఆయన ముందుగా కాంగ్రెస్‌ మిత్ర పక్షాలనే చీల్చుకొని తీసుకుపోతారని, ముందుగా కాంగ్రెస్ పార్టీనే దెబ్బ తీస్తారని రేవంత్‌ రెడ్డి పదేపదే హెచ్చరిస్తునే ఉన్నారు. ఆయన హెచ్చరిస్తున్నట్లే యూపీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్‌ హస్తం విడిచిపెట్టి కేసీఆర్‌ పంచన చేరారు. అదేవిదంగా కర్ణాటకలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న జేడీయు అధినేత కుమారస్వామి కేసీఆర్‌ పంచన చేరారు. వారిరువురూ కలిసి కర్ణాటకలో కాంగ్రెస్‌ని దెబ్బ తీయబోతున్నారని, అందుకోసం కేసీఆర్‌ కర్ణాటకకి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడికి రూ.500కోట్లు ఆఫర్ చేశారంటూ రేవంత్‌ రెడ్డి నిన్న మరోమారు డేంజర్ బెల్ మ్రోగించారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఇంకా మేల్కొన్నట్లు లేదు!

సంక్రాంతి పండుగ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించి కార్యకలాపాలు ప్రారంభిస్తామని కేసీఆర్‌ ఇదేవరకే ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాలలో బిఆర్ఎస్‌కి గుర్తింపు లభించాలంటే అక్కడ స్థానిక పార్టీలు లేదా నేతలను ఆకర్షించాల్సి ఉంటుంది. గుజరాత్‌లో శంకర్ సింగ్‌ వాఘేలా, ఒడిశాలో గిరిదర్ గమాంగ్, యూపీలో అఖిలేశ్ యాదవ్, కర్ణాటకలో కుమారస్వామి, పంజాబ్‌లో సిఎం భగవంత్ మాన్, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, ఝార్ఖండ్‌లో హేమంత్ సొరేన్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే… ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీని దాని అదినేతలని తనతో కలిసి పనిచేసేందుకు ఒప్పించగలిగారు.

వారీలో ఎవరూ బిజెపిని తాకలేరు కనుక బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నుంచే నేతలని ఆకర్షించేందుకు ప్రయత్నించడం ఖాయం. నానాటికీ బలహీనపడుతున్న కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగడం కంటే బిఆర్ఎస్‌ బలమైనదని ఉత్తరాది పార్టీలు, వాటి నేతలు నమ్మిన మరుక్షణమే కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పేసి కేసీఆర్‌తో చేతులు కలపడానికి వెనకాడరు.

కనుక జాతీయ రాజకీయాలలోకి సొంత విమానంలో దూసుకొస్తున్న కేసీఆర్‌, తమ పార్టీని బలహీనపరచక మునుపే, తమ మిత్రపక్షాలని ఎత్తుకుపోక ముందే కాంగ్రెస్‌ అధిష్టానం మేల్కొవాలి. లేకుంటే భారత్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ శాస్వితంగా అదృశ్యమవుతుంది. కాంగ్రెస్‌ యువరాజు రాహుల్ గాంధీ ఎలాగూ గడ్డాలు,మీసాలు పెంచుకొని సన్యాసి వేషం ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక చివరికి దానికే ఫిక్స్ అయిపోవలసి ఉంటుంది.