KCR - Etela - Rajendraతెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఈటెల రాజేంద్రను తెలంగాణ మంత్రివర్గం నుండి సాగనంపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను తప్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్న ఆ మధ్య నాకు వచ్చిన పదవి ఎవరి భిక్షా కాదు ఉద్యమ సమయంలో నా పనితీరుపై నజరానా అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈటెల పై అధికారపక్ష నేతలు కూడా ఇండైరెక్టుగా కామెంట్లు చేస్తున్నారు.

నిన్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మీద ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు. కొందరు పదవులు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, వారు పార్టీ వల్లే ఆ పదవులు వచ్చాయని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు రాబోయే 30 రోజుల్లో పంచాయ‌తీల రూపురేఖ‌లు మార్చేద్దామంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాక్ష‌న్ ప్లాన్ కోసమంటూ పెట్టిన సమావేశానికి ఈటెలకు ఆహ్వానం అందలేదు. ఈటెల రాజేంద‌ర్ హైద‌రాబాద్ లో ఉండి కూడా సమావేశానికి వెళ్ళలేదు.

ఫోన్ వ‌స్తే బ‌య‌ల్దేర‌దామ‌నే ఉద్దేశంతోనే చేతిలో మొబైల్ ప‌ట్టుకుని సాయంత్రం వ‌ర‌కూ ఈటెల ఎదురుచూశారంటూ ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. దీనితో ఈటెలకు ముఖ్యమంత్రి మధ్య అగాధం ఏర్పడింది అనేది స్పష్టం అవుతుంది. దీనితో ఈటెలను సాగనంపడానికి రంగం సిద్ధం అవుతుందా? అనే అనుమానం రాకమానదు. మరోవైపు ఈ నెలలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని సమాచారం. కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.