Etela Rajender - YS Sharmila - Telangana Politicsఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త పార్టీలు… అనూహ్య ఫలితాలు… నాయకుల కప్పదాట్లతో రాజకీయం రసకందాయంగా మారింది. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితం, కొన్ని మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో తెరాస తమకు తిరుగు లేదు అని అనుకోవడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో పార్టీలో తొలినాళ్ళ నుండీ ఉన్న ఈటల వంటి నేతను బయటకు పంపడానికి కూడా కేసీఆర్ సంశయించలేదు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసి ఫలితాలతో తమకు ఎదురులేదని… 2023 ఎన్నికలలో తామే అధికారంలోకి వస్తామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టి ఈటల వంటి నేత తో బోణీ కొట్టారు.

ఇక ఈ మధ్య కాలంలో తన ప్రభ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తొందరలో కొత్త పీసిసి అధ్యక్షుడు రావడంతో తమ భాగ్యరేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక ఒకప్పుడు సమైఖ్యవాదిగా ముద్ర వేసుకున్న వైఎస్ షర్మిల కూడా సొంతంగా పార్టీ పెట్టి తన తండ్రి సానుభూతిపరుల ఓట్ల మీద నమ్మకంతో తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టారు.

ఈ రకంగా తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు తమ భవిష్యత్తు మీద అంతో ఇంతో ఆసక్తిగానే ఉన్నాయి. అయితే విజయలక్ష్మి 2023లో ఎవరిని వరిస్తుందో చూడాలి. మరోవైపు… అసలు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ఒక ఏడాది ముందే ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా ఉంది.