Revanth Reddy - EtelaRajender new partyఈటల రాజేందర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆయనను అధికార పార్టీనే కావాలని బయటకు పంపింది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. స్వతాహా సౌమ్యుడు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో ఈటల పై సానుభూతి కనిపిస్తుంది. మరోవైపు ఈటల సొంత పార్టీ పెడతారని కూడా ప్రచారం జరుగుతుంది.

అయితే ఈటలతో పాటు ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా చేరతారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే పార్టీ పెట్టి విఫలమైన కోదండరామ్ ను కూడా కలుపుకుని వెళ్తే తమ పార్టీకి తిరుగుండదు అని వారు అనుకుంటున్నారట.

రేవంత్ దూకుడుతో యువత ను ఆకర్షిస్తే… కోదండరామ్, ఈటల తెలంగాణవాదులను ఆకర్షిస్తారు అని వారి అంచనా. పార్టీ ఏర్పాటు పై ఒక క్లారిటీ రాగానే ఈటల తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, అదే సీటు నుండి కొత్త పార్టీ తరపున పోటీ చేసి బలం నిరూపించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు వీరంతా సొంత పార్టీ పెట్టడం కాకుండా బీజేపీలో చేరితే మరింతగా కేసీఆర్ ని ఎదురుకునే శక్తి వస్తుందని కూడా కొందరు సలహా ఇస్తున్నారట. అయితే బీజేపీలోకి వెళ్లి ఇప్పటికే ఉన్న నేతల వెనకాల నిలబడటం అటు రేవంత్ కు గానీ ఇటు ఈటలకు గానీ ఇష్టం లేదని తెలుస్తుంది.