Etcherla_YCP_MLA_Kiran_Kumarసిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి ప్రజలకు బొట్టుపెట్టి మరీ చెప్పి, మరో 20 నెలల తరువాత వచ్చే ఎన్నికలలో తమను ఆశీర్వదించమని కోరేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు మే 10వ తేదీ నుంచి గడప గడపకీ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు.

తమ సంక్షేమ పధకాలను మెచ్చి ప్రజలు తమకు ఎక్కడికక్కడ మంగళహారతులిచ్చి, పూల దండలు వేసి స్వాగతం పలుకుతారనుకొంటే, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.

ఓ ఇంటి గుమ్మం ముందు తగిలించిన ఈ బోర్డు చూస్తే పరిస్థితి అర్ధం అవుతుంది. “గడపగడపకు వచ్చే అధికారులు, వైసీపీ నేతలకు విజ్ఞప్తి. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సిపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ అమలుచేసిన తరువాత మా గడపకు రండి,” అంటూ ఓ ఫ్లెక్సీ బ్యానర్ మెయిన్ గేటుకు తగిలించారు.

మూడు రోజుల క్రితం ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ ఈ కార్యక్రమంలో గ్రామానికి వచ్చినప్పుడు స్థానికులు ఆయనను రోడ్డు గురించి నిలదీయడంతో కాసేపు వారిమద్య వాగ్వాదాలు జరిగాయి.

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కి ఇంకా చేదు అనుభవం ఎదురైంది. ఆయన నిన్న జి.సిగడ మండలంలోని విజయరామపురం గ్రామంలో పర్యటించేందుకు రాగా, గ్రామస్తులు ఆయన కారును ఊరు శివార్లలోనే అడ్డుకొని “ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌… గో బ్యాక్.. గో బ్యాక్…” అంటూ నినాదాలు చేశారు.

ఆయన వారికి నచ్చ జెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు ఆయన తమ గ్రామంలో ప్రవేశించడానికి వీలులేదని అడ్డుకొన్నారు. ఇక చేసేదేమీ లేక పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.

ఇన్ని సంక్షేమ పధకాలు ఇస్తున్నా కూడా తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం చూసి వైసీపీ నేతలు విస్తుపోతున్నారు. ఇటు పార్టీలో అటు బయట మద్దెల దరువు వాయించేస్తుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదని తలలు పట్టుకొంటున్నారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల వరకు ప్రజల మద్య తిరగాలనే తమ అధినేత ఆదేశాన్ని ఏవిదంగా పాటించాలని వాపోతున్నారు.