Errabelli inclusion brings headache to KCR?ఈ పిలుపిస్తోంది… అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు కాదు, మొన్నటివరకు ప్రతిపక్షంలో ఉండి, ఇటీవలే కేసీఆర్ చెంత చేరిన టిడిపి నేతలు! తెలుగుదేశం పార్టీలో అనేక కీలక పదవులు అనుభవించిన ఎర్రబెల్లి దయాకరరావు గారికి టీఆర్ఎస్ లో చేరగానే అప్పటివరకు ఉన్న టెన్షన్స్ కాస్త తగ్గిపోయాయట. ఈ వ్యాఖ్యలను స్వయంగా ఎర్రబెల్లి దయాకరరావు గారే స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు.

“తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీలో ఉన్నంత కాలం చాలా టెన్షన్ తో బతికా, ఎన్నో సమస్యలు వెంబడించాయి, ఇపుడు టీఆర్ఎస్ లో చేరడంతో టెన్షన్లన్నీ పోయాయి, ఒక్కసారిగా తలపై భారం తీరినట్లుగా ఉంది, టీఆర్ఎస్ అనుబంధ ఎమ్మెల్యేలుగా గుర్తింపు వచ్చింది, చాలా సంతోషం, ఇక తనకు ఎలాంటి కోరికలు లేవు” అంటూ చేసిన ఎర్రబెల్లి వ్యాఖ్యలకు మీడియా వర్గీయులు… ‘మంత్రి పదవి మీద కూడా ఆశ లేదా?’ అని ప్రశ్నించగా… ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోవడం ఎర్రబెల్లి వంతయ్యింది.

ఇదిలా ఉంటే… ప్రస్తుత టీ-టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ఇప్పటివరకు ముందు వరుసలో కూర్చున్న రేవంత్ రెడ్డి, తాజా పరిణామాలతో నాలుగో వరుసకు మారిపోయారు. దీంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని… ఈ చర్యలన్నీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని, “మాకూ మంచి రోజులు వస్తాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.