errabelli dayakar rao comments on ktr health టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగానే వారంతా ఆయన త్వరగా కోలుకోవాలని మీడియా ముందు, ట్విట్టర్ లోనూ కోరుకోవడం మాములే. అయితే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకో అడుగు ముందుకు వేశారు.

రాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగాన్ని అభివృద్ది చేస్తున్న మంత్రి కేటీఆర్‌కి కరోనా లెక్క కాదని మంత్రివర్యులు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు, పోరాట యోధుడు, అన్నింటికీ మించి ఆత్మ స్థైర్యం, గుండె నిబ్బరం కలిగిన కేటీఆర్ని ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

సాధ్యమైనంత వేగంగా మంత్రి కేటీఆర్ కోలుకోవాలని, అయన సేవల కోసం నాతో సహా, యావత్ రాష్ట్రం, దేశం ఎదురుచూస్తున్నదని అన్నారు. సరిగ్గా ఇటువంటి ఆటిట్యూడే పరిస్థితి ఇంతవరకు తెచ్చింది. కరోనా కు రాజూ బీద అనే తారతమ్యం లేదు. తెలంగాణ పోరాటయోధుడికి రావొచ్చు… సమైఖ్య ఆంధ్ర ధీరుడికి రావొచ్చు.

రాజకీయ నాయకులు తాము బాధ్యతగా మెలిగి ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎంతటివారైనా వైరస్ బారిన పడితే డాక్టర్ సలహా మేరకు వైద్యం చేయించుకుని బయటపడాలి. మంత్రులు, రాజకీయ నాయకులు అధినేతల మెప్పు కోసం మాట్లాడే మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు.