YS jagan warangal campaignజగన్ వెంటే జనం… నియోజక వర్గంలో ఎక్కడ చూసినా ‘యువనేత’ నినాదాలే… ప్రత్యర్దులంతా డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తుంటే, జగన్ సభలకు మాత్రం జనం స్వచ్ఛందంగా హాజరయ్యారు… ఇలా ఒకటేమిటి… వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జగన్ వర్గపు మీడియాలు రాసిన అతిశయోక్తపు రాతలకు అడ్డే లేదు. అయితే అవి వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయో చాటిచేప్తే, వాటిని ‘పచ్చ మీడియా’ అంటూ సంభోదించడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరిది ‘పచ్చో…’ ఎవరిది ‘పిచ్చో…’ అవగతమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్ ప్రచారానికి సమీకరించిన జనాల సంఖ్య కంటే తక్కువ ఓట్లను తెచ్చుకుని తెలంగాణాలో తన స్టామినా ఏంటో వైసీపీ నిరూపించుకుందని సోషల్ మీడియాల వేదికగా జగన్ పార్టీకి పడుతున్న కౌంటర్లు. ఓటమి గురించి విశ్లేషించడానికి పెద్దగా ఏమీ లేకపోయినా వరంగల్ ఫలితాల తర్వాత జగన్ పార్టీ పరిస్థితి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక సంస్థాగత పార్టీగా తెలంగాణాలో వైసీపీ మనుగడ ఇక ప్రశ్నార్ధకమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

ఇప్పటివరకు టీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్న ఆరోపణలు చవిచూసిన వైసీపీ, ఇక భవిష్యత్తులో దానిని కార్యరూపంలోకి తెచ్చినా ఆశ్చర్య పడాల్సిన పని లేదని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే ‘గ్రేటర్’ ఎన్నికల్లో సింగల్ గా ప్రచారం చేసుకునే స్థాయిని వైసీపీ దిగజార్చుకుందని, ఉన్న అరకొర కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని, తాజా పరిస్తితులను గమనించి వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు జగన్ మరియు ఆయన మీడియా వర్గాల కళ్ళు తెరిపించాయని, ఇప్పటికైనా “జ్ఞానోదయం”తో వ్యవహరిస్తారని పరిశీలకులు ఆశిస్తున్నారు.