England win 3rd ODI vs Australiaక్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ కున్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అందులో భాగంగా తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-0తో మట్టి కరిపించి టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు వన్డేలలో మాత్రం తీవ్ర పరాభవం తప్పడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ తన రివెంజ్ ను తీర్చుకోవడానికి వన్డే సిరీస్ ను వినియోగించుకుంటోంది. టెస్ట్ లలో తమను ఎలాగైతే ‘వైట్ వాష్’ చేసారో, వన్డేలలో ఆస్ట్రేలియాను కూడా అలాగే ‘వైట్ వాష్’ చేయడానికి స్కెచ్ సిద్ధం చేసినట్లుగా కనపడుతోంది.

రెండు వరుస విజయాల తర్వాత, సిరీస్ నిలుపుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మళ్ళీ ఓటమి పాలయ్యింది. దీంతో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను 3-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. అంతేకాదు, మిగిలిన రెండు మ్యాచ్ లలో కూడా ఆసీస్ ను భంగపాటుకు గురిచేసి ‘వైట్ వాష్’ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంది. అయితే మళ్ళీ ఆసీస్ పుంజుకుంటుందో లేదో గానీ, సొంతగడ్డపై వన్డే సిరీస్ ను ఘోరంగా ఓడిపోవడం మాత్రం కంగారులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.

మరో విశేషం ఏమిటంటే… ఈ మూడు వన్డేలలోనూ ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ విభాగంలో టాప్ స్కోరర్ గా నిలవడం. మూడవ వన్డేలో 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 286 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ విభాగంలో అందరూ రాణించినా, ఆసీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు బట్లర్ అజేయమైన సెంచరీతో ఇంగ్లాండ్ 302 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలలో చివరి 10 ఓవర్లే మ్యాచ్ ను ఇంగ్లాండ్ వైపుకు తిప్పాయి.