Joe Root -England vs South Africa  World T20జెంటిల్మెన్ గేమ్ గా పేరుబడ్డ క్రికెట్ లో ఎప్పుడూ ఏదైనా జరగవచ్చు… అన్న సంగతి క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక 79 పరుగులకే చతికిలపడవచ్చు, అలాగే, 230 పరుగుల భారీ స్కోర్ ను కూడా 20 ఓవర్ల లేపే చేధించవచ్చు. భారీ స్కోర్లు లేక చప్పగా సాగుతున్న ప్రస్తుత టీ 20 ప్రపంచ కప్ లో మొదటిసారిగా భారీ స్కోర్లు నమోదయ్యాయి.

దక్షిణాఫ్రికా – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు మాంచి కిక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏకంగా 229 పరుగులు చేసి దాదాపుగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నంత పని చేసింది. అయితే ఇప్పటికే ఆడిన ఒక మ్యాచ్ లో ఓటమి పాలై ఉన్న ఇంగ్లాండ్ జట్టు, తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో 230 పరుగుల లక్ష్యాన్ని చేధించి పాయింట్ల పట్టికలో ఖాతాను ఆరంభించింది.

లక్ష్య చేధనలో దాదాపు చివరి వరకు ఉండి ఇంగ్లాండ్ ను గట్టెక్కించాడు రూట్. 82 పరుగులు చేసిన రూట్, జట్టుకు 10 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉన్న తరుణంలో అవుటయ్యాడు. అయితే అదే ఓవర్లో 10 పరుగులు రాబట్టి మ్యాచ్ ను టై చేసిన తర్వాత చివరి ఓవర్లో విజయానికి ఒక పరుగు మాత్రమే కావాల్సిన నేపధ్యంలో మ్యాచ్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మొదటి రెండు బంతులకు రెండు వికెట్లు నేలకూలడం… మరో బాల్ డిఫెన్స్ ఆడడంతో, మ్యాచ్ లో మరో సంచలనం నమోదవుతుందేమోనని అంతా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో విజయానికి కావాల్సిన ఒక్క పరుగును చేసి మ్యాచ్ ను ఇంగ్లాండ్ పరం చేసాడు మొయిన్ అలీ. భారీ లక్ష్యాన్ని చేధించి రికార్డు నెలకొల్పిన ఇంగ్లాండ్ జట్టు సంతోషంలో మునిగి తేలుతోంది.