england vs south africa odi 2017మరో మూడు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపధ్యంలో… ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ కీలకమైన సిరీస్ ను దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ వశం చేసుకుంది. కీలకమైన రెండో వన్డేలో, చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ సూపర్ సెంచరీతో ఏకంగా 330 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. 79 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో స్టోక్స్ జట్టును ఆదుకోగా, చివర్లో బట్లర్ 65, అలీ 33 పరుగులతో చెలరేగారు. అలాగే టాప్ ఎండ్ లో రూట్ 39, మోర్గాన్ 45 పరుగులు చేయగా, సఫారీ బౌలింగ్ లో రబడ ఒక్కడే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 50 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లను సొంతం చేసుకున్నాడు.

ఇక భారీ లక్ష్య చేదనలో ఓపెనర్ డీకాక్ 98 పరుగులు చేయగా, కెప్టెన్ డివిలియర్స్ 52 పరుగులతో రాణించాడు. ఇతర బ్యాట్స్ మెన్లు కూడా తమ వంతు సాయం చేయడంతో, ఖచ్చితంగా సఫారీలదే విజయం అని అంతా భావించారు. చివరి ఓవర్ లో విజయానికి కేవలం 7 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, క్రీజులో మిల్లర్, మోరిస్ ఉన్నారు. అయితే కేవలం 4 పరుగులు మాత్రమే లభించడంతో 2 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ ను వశం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు.