England v South Africa: Ben Stokes & Toby Roland-Jonesరెండు టెస్టులు ముగిసే సమయానికి 1-1తో సమానంగా నిలిచిన ఇంగ్లాండ్ – దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో… మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు కుక్ (88), స్టోక్స్ (112) రాణింపుతో 353 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. సఫారీ బౌలర్లలో మోర్కెల్, రబడ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా, ఫిలందర్ 2 వికెట్లు, మహారాజా, మోరిస్ చెరో వికెట్ ను దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సఫారీ బ్యాట్స్ మెన్లకు తొలి మ్యాచ్ ఆడుతోన్న రోలాండ్ జోన్స్ చుక్కలు చూపించాడు. తొలి వికెట్ 18 పరుగుల వద్ద నేలకూలగా, 61 పరుగులు చేరుకునే సమయానికి 7 వికెట్లు క్యూ కట్టాయి. ఇందులో టాప్ 4 బ్యాట్స్ మెన్లను పెవిలియన్ పంపిన ఘనత రోలాండ్ జోన్స్ కు దక్కింది. ఈ దెబ్బకు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 126 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఫాలో ఆన్ తప్పించుకోవాలన్నా మరో 27 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే క్రీజులో బావుమా (34) రూపంలో ఓ బ్యాట్స్ మెన్ ఉండడంతో, ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కే అవకాశాలున్నాయి. సిరీస్ సమానంగా నిలవడంతో, ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న ఇంగ్లాండ్ సిరీస్ విజేతను నిలిచే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.