England Vs South Africa 3rd Test Match 2017 ఇంగ్లాండ్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు నుండి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లాండ్ జట్టు జయకేతనం ఎగురవేసి, సిరీస్ లో 2-1తో లీడ్ లో ఉంది. దీంతో ఈ సిరీస్ విజేతగా నిలవాలంటే అది ఒక్క ఇంగ్లాండ్ జట్టుకే సాధ్యం. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడు ఇప్పటికే ముగిసాయి కాబట్టి, నాలుగవ మ్యాచ్ లో సఫారీలు గెలిస్తే, సిరీస్ సమంగా నిలుస్తుంది. ఒకవేళ డ్రా అయినా కూడా సిరీస్ విజేతగా ఇంగ్లాండ్ అవతరిస్తుంది.

లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నాలుగవ ఇన్నింగ్స్ లో 492 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు కేవలం 252 పరుగులకు ఆలౌట్ కావడంతో, 239 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ ఎల్గర్ (136) ఒంటరి పోరాటం తప్ప, ఏ ఇతర బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో, తనకు సహకారం అందించే వారు లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. లోయర్ ఎండ్ లో బావుమా (32), మోరిస్ (24), మహారాజ్ (24) రాణించడంతో ఘోర ఓటమి నుండి తప్పించుకుంది.

తొలి మ్యాచ్ ఆడుతున్న రోలాండ్ జోన్స్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటగా, రెండవ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే చివరి మూడు వికెట్లను మొయిన్ అలీ హ్యాట్రిక్ ద్వారా సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణించిన బెన్ స్టోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతమైంది. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ ఆగష్టు 4వ తేదీ నుండి ప్రారంభం కానుంది