england-vs-australia-odi-whitewashఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ‘వైట్ వాష్’లు చేయడంలో ఆస్ట్రేలియా సిద్ధహస్తురాలిగా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు మాత్రం అదే ‘వైట్ వాష్’ల రుచిచూస్తూ ఘోర అవమానాల పాలవుతోంది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన అయిదు వన్డేల మ్యాచ్ సిరీస్ ను 5-0తో కోల్పోయి విమర్శల పాలయ్యింది. చివరి వన్డేలో దాదాపుగా గెలిచినంత పని చేసిన ఆసీస్ కు బట్లర్ ఒంటరి పోరాటం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

కేవలం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 114 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా, ఆ సమయంలో క్రీజులో ఉన్న బట్లర్ కు తోడుగా రషీద్ ఖాన్ అండగా నిలవడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. 122 బంతుల్లో 110 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను ఒంటి చేత్తో గెలిపించిన ఘనత బట్లర్ సొంతం చేసుకున్నాడు. లక్ష్యానికి చేరువ అయిన సమయంలో రషీద్ ఔటైనా, జట్టును విజయతీరాలకు చేర్చడంలో బట్లర్ సక్సెస్ అయ్యాడు.

గత నాలుగు వన్డే సిరీస్ లను పరిశీలిస్తే… సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలోనే 4-1 తేడాతో పరాభవం చెందగా, ఇండియా చేతిలో కూడా 4-1 తేడాతో ఓటమి పాలయ్యింది. అంతకుముందు చిరకాల ప్రత్యర్ధి న్యూజిలాండ్ చేతిలో 2-0తో ఓడిపోయింది. ఇలా వరుస ఓటములు అగ్ర జట్టును మానసికంగా కూడా కృంగదీస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో వరల్డ్ కప్ ఉన్న నేపధ్యంలో… ఫాం లేక జట్టు సతమతమవుతోంది.