England-vs-Australia-3rd-ODI---481క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటున్నాయి. క్రికెట్ లోకి టీ20 వచ్చిన తర్వాత అవాక్కయ్యే రీతిలో బ్యాట్స్ మెన్లు స్కోర్లు చేస్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్ లో సరికొత్త రికార్డ్ నమోదయ్యింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 481 పరుగులు చేసి గతంలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఉన్న తమ రికార్డును (పాకిస్తాన్ పై 444 పరుగులు) మరింత పదిలం చేసుకుంది.

నిజానికి ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు 500 పరుగులను అవలీలగా అందుకుంటుందని భావించినప్పటికీ, ఇన్నింగ్స్ చివరి నాలుగు ఓవర్లలో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయడంతో చారిత్రాత్మకమైన 500 పరుగులకు 19 దూరంలో నిలిచింది. ఈ మొత్తం ఇన్నింగ్స్ లో 21 సిక్సర్లు, 41 బౌండరీలు ఉన్నాయి. ఓపెనర్లు జాసన్ రాయ్ 61 బంతుల్లో 82 పరుగులు చేయగా, బైర్ స్టౌ 92 బంతుల్లో 139 పరుగులు, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ హేల్స్ 92 బంతుల్లో 147 పరుగులు చేసి ఆసీస్ బౌలర్లను ఆడుకున్నారు.

ఇక కెప్టెన్ మోర్గాన్ అయితే ఇంగ్లాండ్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీని (21 బంతుల్లో) నమోదు చేసి, మొత్తమ్మీద 30 బంతుల్లో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ల దూకుడు ముందు ఆసీస్ బౌలర్లు నిస్సహాయులయ్యారు. టై అయితే 9 ఓవర్లలో ఏకంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిచర్డ్సన్ 92, స్తోనిస్ 85, స్టాన్ లేక్ 74, అగర్ 70 పరుగులతో హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. మరి ఈ భారీ లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందా?