England Cricketer Andrew Flintoff asks who is Amitabh Bachhanభారతీయుల దెబ్బ రుచి ఎలా ఉంటుందో ఏమిటో బ్రిటన్లకు బాగా తెలుసు. ఆనాటి స్వాతంత్ర్య సమరం నుండి మొన్నటి గంగూలీ షర్టు తీసి తిప్పే వరకు అనేక సందర్భాలలో ఇండియన్స్ అంటే ఏంటో ఆంగ్లేయులకు తెలిసి వచ్చింది. ఇండియాలో సిరీస్ గెలిచినందుకు గానూ గ్రౌండ్ లో షర్టు తీసి హంగామా చేసిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కు లార్డ్స్ వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్ లో గంగూలీ ఇచ్చిన సమాధానం ఆ దేశస్థులను అవాక్కయ్యేలా చేసింది. ఇండియన్స్ పౌరుషం రుచి ఏమిటో అప్పటికే పలువురు మహనీయులు స్వాతంత్ర్య సమరంలో ఆంగ్లేయులకు పరిచయం చేసారు.

అయితే కాలం గడుస్తున్న కొద్ది అన్ని జనరేషన్ల పౌరుషాన్ని బ్రిటన్లు చూడాలనుకుంటున్నట్లున్నారు. గంగూలీ ఎపిసోడ్ తర్వాత తొలి టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ను కెలికిన అండ్రూ ఫ్లింటాఫ్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏకంగా వరుసగా 7 సిక్సర్లు బాది మరోసారి భారత్ పవర్ ఏమిటో తెలియజేసేలా చాటాడు. అప్పటి నుండి కాస్త నిశ్శబ్దంగా ఉన్న ఫ్లింటాఫ్ మరోసారి భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్లింటాఫ్ ని సెలబ్రిటీలతో సహా అందరూ ఏకిపారేస్తున్నారు.

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా మ్యాచ్ లో కోహ్లి బ్యాటింగ్ ప్రతిభ చూసి అమితాబ్ వరుస ట్వీట్లతో క్రికెట్ పై తన మక్కువను చాటుతున్నారు. అయితే అమితాబ్ స్పందనను చూసి… “హూ ఈజ్ దిస్ అమితాబ్” అంటూ వ్యాఖ్యానించడంతో రచ్చకు తెరలేపాడు ఫ్లింటాఫ్. ఇండియాలో చాలా సార్లు ఫ్లింటాఫ్ పర్యటించాడు. అమితాబ్ తెలియదు అన్న పదానికి ఆస్కారం లేనన్ని రోజులు భారత్ లో గడిపాడు. అయినా గానీ ‘అమితాబ్ ఎవరు?’ అని తనకు తెలియనట్లు వ్యాఖ్యానించడమే ఈ దుమారానికి ప్రధాన కారణం.

దీనిపై ఒక్క నెటిజన్లు మాత్రమే కాదు, క్రీడా ప్రముఖులు, సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఫ్లింటాఫ్ కు జ్ఞానోదయం అయ్యేలా చీవాట్లు పెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. అసలు ఎవరినైతే అమితాబ్ పోగుడుతున్నారో… ముందుగా వారే లైన్ లోకి వచ్చారు. “లండన్ లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంను సందర్శిస్తే ఆయనెవరో తెలుస్తుంది” అంటూ విరాట్ కోహ్లి సుతిమెత్తగా చేసిన వ్యాఖ్యలు భారతీయ ఘాటుదనాన్ని చాటుతున్నాయి. ఆల్ రౌండర్ జడేజా అయితే, మరో అడుగు ముందుకేసి “ఆయన పేరు షెహన్ షా… బంధుత్వంలో నీ అయ్యలాంటోడు” అంటూ మండిపడ్డాడు.

ఇక, సునీల్ గవాస్కర్ “ట్విట్టర్ లో అమితాబ్ ను ఫ్లింటాఫ్ గుర్తించలేదు. ఆయన ఖాతాను మారియా షరపోవా నిర్వహిస్తున్నదేమో!” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించి భారతీయతను చాటారు. బ్రిటిషర్స్ కు ఎన్ని సార్లు ఇండియన్ పవర్ రుచి చూపించినా మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనే విధంగా ఏదొక విషయంలో రచ్చకు తెరలేపుతున్నారు. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలే ఇండియన్స్ చేయాలనుకుంటే… అప్పుడు ఫ్లింటాఫ్ గౌరవం ఏమవుతుందో, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో సదరు ఆటగాడికే కళ్ళ ముందు కనపడుతుంది.