KCR-Malla-Reddy-Enforcement-Directorateతెలంగాణలో ఈడీ, ఐ‌టి, సీబీఐ దాడులు జరుగుతున్న తీరు, తీవ్రత చూసినట్లయితే కేసీఆర్‌ ప్రభుత్వం చుట్టూ బలంగా ఉచ్చు బిగుసుకొంటున్నట్లే కనిపిస్తోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి 50 ఐ‌టి బృందాలు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్ళు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.

కేసీఆర్‌ క్యాబినెట్‌లో కేటీఆర్‌, హరీష్‌ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి తదితరులు చాలా కీలకమైన వ్యక్తులు.

వారిలో మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌ చుట్టూ ఈడీ, ఐ‌టి శాఖలు ఉచ్చు బిగిస్తున్నాయి. పది రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్‌కి చెందిన గ్రానైట్ కంపెనీ, కార్యాలయాలు, ఇళ్ళలో ఈడీ సోదాలు చేసింది. అదే రోజున టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్ర ఇళ్ళు, కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. కొన్ని రోజుల క్రితమే టిఆర్ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన రూ.80.65 కోట్లు విలువగల స్టిరాస్తులను ఈడీ సీజ్ చేసింది.

నాలుగైదు రోజుల క్రితం తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు విచారించారు. వీరిద్దరూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులు. వారి తర్వాత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పీఏ హరీష్‌ని, నగరంలోని ఓ వ్యాపారవేత్తను సోమవారం ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొట్ట మొదట వినిపించిన పేరు సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరే. అయితే ఆ కేసుతో సంబందం ఉన్న పలువురిని ఈడీ ప్రశ్నించింది. అరెస్ట్ చేసింది కూడా. కానీ ఇంతవరకు కల్వకుంట్ల కవిత జోలికి మాత్రం వెళ్లలేదు. ఒకవేళ వస్తే న్యాయస్థానంలో ఎదుర్కొంటానని ఆమె చెప్పారు.

తాము మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నందున ఏదోరోజు తమపై ఈడీ, ఐ‌టి, సీబీఐ దాడులు చేయిస్తుందని కేసీఆర్‌ ముందే చెప్పారు. ఇప్పుడు దాడులు మొదలవగానే ఎవరూ వాటికి భయపడవద్దని ఎదురుతిరిగి పోరాడాలని కేసీఆర్‌ ధైర్యం నూరిపోశారు. కానీ ఈ కేసులలో చిక్కుకొంటే తమ వ్యాపారాలు దెబ్బ తిని ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతామని వారు భయపడుతున్నారు. కేసీఆర్‌ ప్రోద్బలంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్రమోడీని తీవ్రస్థాయిలో విమర్శించారు. కానీ ఇప్పుడు వారే కేసీఆర్‌ అనవసరంగా ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూసి తమకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టారని లోలోన బాధపడుతున్నారు.

కనుక కేసీఆర్‌ వారందరినీ ఎంతకాలం పట్టి ఉంచగలరు?ఈ దాడుల నుంచి వారికి ఎలా రక్షణ కల్పించగలరు?టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను పట్టి ఉంచలేకపోతే, వారికి కేసీఆర్‌ రక్షణ కల్పించలేకపోతే అప్పుడు ఆయన ప్రభుత్వం పరిస్థితి ఏమవుతుంది?అనే ప్రశ్నలకు రాబోయే రోజులలో సమాధానాలు లభిస్తాయి.