Magunta Sreenivasulu Reddyఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని ఇళ్ళు, కార్యాలయాలలో నాలుగు రోజుల క్రితం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

వాటిపై ఆయన స్పందిస్తూ, “నేను వైసీపీ ఎంపీని గనుకనే దీనికి రాజకీయరంగు పులుముకొంది. దేశంలో ఏ రెడ్డి మద్యం వ్యాపారం చేస్తున్నా అందరూ మాగుంట శ్రీనివాసులు రెడ్డే అంటారు. మేము మా తండ్రిగారి హయం నుంచి లిక్కర్ బిజినెస్‌లో ఉంటూ ఢిల్లీలో కూడా మద్యం వ్యాపారం చేస్తుండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నాను. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు, నా కుమారుడికి ఎటువంటి సంబందమూ లేదు.

ఢిల్లీలో గల 32 లిక్కర్ జోన్లలో కేవలం రెండే జోన్లలో మా బంధువులకు మద్యం దుకాణాలున్నాయి. వాటిలో మాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు. కానీ వారు నా బందువులు కావడంతో ఈడీ అధికారులు నెల్లూరులోని మా ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు చేశారు. కానీ మా వివరణతో వారు సంతృప్తి చెంది వెళ్ళిపోయారు. ఎటువంటి పత్రాలు పట్టుకువెళ్ళలేదు.

ఈడీ సోదాలను మా వ్యాపారాలపై దాడిగా భావిస్తున్నాము. దీంతో మా పేరుప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం జరిగినట్లు భావిస్తున్నాము. ఈ దాడులతో ఢిల్లీలో మద్యం వ్యాపారాలు చేస్తున్న మా బంధువులు చాలా నష్టపోయారు. కానీ వాటితో మాకు సంబందం లేదు కనుక మేమేమీ నష్టపోలేదు. అయినా ఈడీ దాడుల వలన రాజకీయంగా మాకు ఎటువంటి ఇబ్బంది, నష్టమూ లేదు. వచ్చే ఎన్నికలలో మా అబ్బాయి రాఘవరెడ్డి ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తాడు,” అని మాగుంట చెప్పారు.

మాగుంట వివరణ బాగానే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె కూడా ఇలాగే చెప్పారు. తనకు స్కామ్‌తో ఎటువంటి సంబందమూ లేదని చెప్పారు. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఇదే కేసులో ఈడీ అధికారులు మళ్ళీ హైదరాబాద్‌ వచ్చి ఆమె ఆడిటింగ్ వ్యవహారాలు చూస్తున్న గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వాటిలో ఆమె ప్రమేయం ఉన్నట్లు నిరూపించే ఆధారాలు ఏవైనా లభించాయా లేదా అనే విషయం పక్కనపెడితే, ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఆమె తండ్రి, తెలంగాణ సిఎం కేసీఆర్‌ నేరుగా ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూస్తూ గద్దె దించుతామని శపదాలు చేస్తున్నారు కనుక ఈడీ అధికారులు ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారని అనుకోవచ్చు. కానీ వైసీపీ ఎంపీలకి ఢిల్లీ పెద్దలతో మంచి బలమైన సంబంధాలున్నాయి కదా? అయినా ఈడీ అధికారులు ఎంపీ మాగుంట వెంటపడ్డారెందుకు?

తాటి చెట్టు కింద కొర్చొని పాలు త్రాగుతున్నానని చెప్పినా ఎవరూ నమ్మరన్నట్లు, అనేక రాష్ట్రాలలో మద్యం వ్యాపారాలు చేస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాను పూలు కడిగిన ముత్యమని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు కానీ ఆయన ముత్యమో కాదో తేల్చాల్సింది… తేల్చబోయేది ఈడీ మాత్రమే.

Exclusive Video Interviews: Watch & Subscribe