Telangana-Pilot-Rohith-Reddyతెలంగాణలో తాండూర్ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసు జారీ చేసింది. ఇద్దరినీ ఈనెల 19న విచారణకి హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

గత ఏడాది బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడినప్పుడు స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిని విచారించగా పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టాడు. వారిలో కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారుతోందని గుర్తించడంతో ఈడీ కూడా రంగంలో దిగి దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ డ్రగ్స్ కేసులోనే ఈడీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది.

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌ని 2017, టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో విచారణకి పిలిచింది ఈడీ. ఆ సమయంలో ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టాలీవుడ్‌లో పూరీ జగన్నాథ్, ఛార్మీ, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్‌, రానా దగ్గుబాటి, ముమైత్ ఖాన్, నందు, తనీష్, నవదీప్ తదితరులని విచారించింది.

కానీ ఆ తర్వాత ఆ కేసుని అటకెక్కించేసింది. సిట్ బృందం ఆ కేసుని అటకెక్కించేస్తే ఈడీ దానిని పట్టుకొని గత ఏడాది సెప్టెంబర్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌ని విచారించింది. కానీ అప్పుడు విచారణ పూర్తికాకపోవడంతో అదే కేసులో మళ్ళీ విచారించేందుకు ఆమెకి ఈడీ మరోసారి నోటీస్ ఇచ్చింది.

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులను ట్రాప్ చేయడంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ శివార్లలో మొయినాబాద్‌లో గల ఆయన ఫామ్‌హౌస్‌కి ముగ్గురు బిజెపి ప్రతినిధులని రప్పించి పోలీసులకి పట్టించారు. మునుగోడు ఉపఎన్నికలకి ముందు జరిగిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అంతవరకు ఎదురే లేదన్నట్లు దూసుకుపోతున్న బిజెపికి ఆ వ్యవహారంతో తల బొప్పి కట్టించారు కేసీఆర్‌.

ఆ కేసులో విచారణకి హాజరు కావాలని ఆదేశిస్తూ బిజెపి పెద్దలకి సిట్ నోటీసులు పంపుతుంటే ఏం చేయాలో, ఎలా బయటపడాలో పాలుపోక బిజెపి పెద్దలు తలలు పట్టుకొంటున్నారు. బహుశః దానికి విరుగుడుగానే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీస్ జారీ చేసి ఉండవచ్చు. ఇది డ్రగ్స్ కేసు కనుక ఆయనని లోపల వేయడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక రోహిత్ రెడ్డిని లోపల వేసి కేసీఆర్‌తో కేంద్రం బేరం పెడుతుందేమో?అయినా కేసీఆర్‌ లొంగకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరు ఉండనే ఉంది. ఆ కేసులో ఆమెని అరెస్ట్ చేసి కేసీఆర్‌ మీద ఒత్తిడి పెంచవచ్చు.

అయితే ఇటువంటి తీవ్రమైన నేరాలు చేస్తున్న ప్రముఖులని దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి సాక్ష్యాధారాలతో సహా పట్టుకొన్నప్పటికీ వారికి చట్టప్రకారం శిక్షించే ప్రయత్నం చేయకుండా ఒకరి నేరాలు మరొకరు మాఫీ చేసుకోవడానికి అస్త్రాలుగా ఈ కేసులను ఉపయోగించుకోవాలనుకొంటే ఈ దర్యాప్తులు, కోర్టులు, కేసుల విచారణల పేరుతో ప్రజాధనం వృధాఅయిపోతుండటం చాలా దురదృష్టకరం.