Kalvakuntla-Kavitha-TRSదేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకులు, ముఖ్యమంత్రులలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా ఒకరు. ఆయన తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాశిస్తుంటారు. బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించి, ప్రధాని పదవి చేపట్టి ఈ దేశాన్ని ఏలాలని కేసీఆర్‌ కోరుకొంటున్నారు. ఇంత శక్తివంతమైన నాయకుడి కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకోవడంతో ఆయనకు చాలా ఇబ్బందికరమే.

ఈ కేసులో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపింది. ఈ శుక్రవారం ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆమె బినామీ వ్యాపార భాగస్వామిగా పేర్కొన్న అరుణ్ పిళ్లైను ఈడీ అధికారులు నిన్న రాత్రే ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో ఆయనను ప్రశ్నించేందుకు వారం రోజులు కస్టడీ తీసుకొన్నారు. కనుక వారిరువురినీ కలిపి లేదా విడివిడిగా ఈడీ ప్రశ్నించనుంది. బహుశః ఈవిషయం కల్వకుంట్ల కవితకు ముందే సమాచారం అందినందున అదే రోజున ఆమె ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని’ కోరుతూ భారత్‌ జాగృతి అధ్వర్యంలో దీక్ష చేసేందుకు బయలుదేరుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే ఆమెను సీబీఐ అధికారులు ఓసారి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కేసులో జరిగిన ఆర్ధికలావాదేవీల గురించి ఈడీ అధికారులు కల్వకుంట్ల కవిత, అరుణ్ పిళ్లైలను ప్రశ్నించబోతున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలను సిఎం కేసీఆర్‌ గట్టిగా ప్రశ్నిస్తున్నందునే ఈడీ, సీబీఐ, ఐ‌టిలను తమపైకి ఉసిగొల్పుతోందని, కానీ తాము ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి భయపడబోమని కల్వకుంట్ల కవిత, బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు, ఎటువంటి అవినీతి జరుగకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే ఈడీ, సీబీఐ, ఐ‌టిలు ఈ స్థాయి వ్యక్తులపై కేసులు పెట్టగలవా?నోటీసులు పంపించి విచారించగలవా?అరెస్టులు చేయగలవా?చేస్తే నిందితులుగా పేర్కొనబడినవారు న్యాయస్థానాలని ఆశ్రయిస్తే అవి చిక్కులో పడకుండా ఉంటాయా?అని ఆలోచిస్తే ఈ లిక్కర్ స్కామ్‌ వాస్తవమే కనుక ఈడీ, సీబీఐలు ముందుకు సాగుతున్నాయని అర్దమవుతుంది.

ఈ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే కేసీఆర్‌, ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా బాధ, ఇబ్బంది ఉంటాయి. అయితే ఆమె అరెస్టుని కూడా బిఆర్ఎస్‌ పార్టీకి రాజకీయంగా లాభం కలిగేలా మలుచుకోగల సమర్దుడు కేసీఆర్‌. కనుక ఇప్పుడు ఆయన ఏవిదంగా పావులు కదుపబోతున్నారో చూడాలి.