Enforcement Directorate -ED- Jaganమొన్న ఆ మధ్య తమకు సంబంధించిన కేసులలో మొదటిగా సిబిఐ కేసులు విచారించిన తరువాతే ఈడీ కేసులు విచారించాలని జగన్, విజయసాయి రెడ్డి ముందుగా సిబిఐ కోర్టుకు, ఆ తరువాత హైకోర్టుకు వెళ్లారు. అయితే రెండు చోట్లా వారికి చుక్కెదురు అయ్యింది.

హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చిన కొన్ని రోజులకే… ఈడీ ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులలో రెండు కొత్త ఛార్జ్ షీట్లు వేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ కు సంబంధించిన కేసుకు సంబంధించి ఈ రెండు ఛార్జ్ షీట్లు వేసింది ఈడీ. కోర్టు కనుక ఈ ఛార్జ్ షీట్లను పరిగణలోకి తీసుకుంటే నిందితులందరికీ నోటీసులు జారీ చేస్తుంది.

ఈడీ.. ఇప్పటికే జగన్ కేసులో 7 చార్జీషీట్లను కోర్టుకు సమర్పించింది. ఈ రెండుతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. చాలా కాలంగా జగన్ కేసులో సిబిఐ అంతగా చురుకుగా లేదు. అయితే ఈ విషయంలో ఈడీ మాత్రం కొంత ఫాస్ట్ గా ఉంది. ఈ కారణంగానే మొత్తం సిబిఐ కేసులు తేలితే గానీ ఈడీ కేసుల విచారణ చేపట్టకూడదు అని జగన్, విజయసాయి రెడ్డిలు కోరుకుంటున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

ఇక పోతే కొత్తగా వేసిన ఛార్జ్ షీట్ల విషయానికి వస్తే… వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ రస్ అల్ ఖైమా అనే చిన్న దేశంతో తో కలిసి జాయింట్ వెంచర్ గా వాన్ పిక్ ప్రాజెక్టును చేపట్టారు. దీనికి అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది అందుకు ప్రతిగా నిమ్మగడ్ద జగన్ కు చెందిన సంస్థలలో 850 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని ఆరోపణ.

అలాగే అనంతపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం అప్పటి వైఎస్ ప్రభుత్వం వేల ఎకరాల భూముల్ని కేటాయించింది. అయితే అక్కడ ఏమీ పనులు చేపట్టకుండా ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. అందుకుగాను క్విడ్ ప్రో కో లో భాగంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణ.