ED pleads not to grant bail to YS Jagan ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార హోదాలో మొట్టమొదటి సారిగా ఈరోజు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తరపున న్యాయవాది కోర్టుకి విజ్ఞప్తి చేశారు.

జగన్ అభ్యర్థనపై సీబీఐ, ఈడీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సీఎంగా ప్రజా విధుల్లో ఉన్నందున హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్‌ తరఫు న్యాయవాదులు కోరగా.. ఈడీ అభ్యంతరం తెలిపింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని వాదించింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది.

అంతకుముందు సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. దీనితో 24న న్యాయస్థానం ఏమని చెప్పినా వచ్చే శుక్రవారం మాత్రం జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌ వ్యవహారంలో సీబీఐ కోర్టు అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది.

సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ వేసినప్పుడే విచారణ పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చిందని, ఇప్పుడు అనుబంధ ఛార్జిషీట్‌ అనుమతించరాదని జగన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే తాజా సమాచారం దొరికినప్పుడల్లా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుందని సిబిఐ చెప్పగా కోర్టుకు అందుకు ఒప్పుకుని అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది.