Elvis Stephenson re-nominated to Telangana Assembly to represent anglo indiansతెలుగుదేశం పార్టీ తెలంగాణాలో భూస్థాపితం అయిపోవడానికి ప్రధాన కారణం ఓటుకు నోటు కేసు. ఆ కేసులో రేవంత్ రెడ్డిని ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడు స్టీఫెన్‌సన్‌ తో కలిసి ట్రాప్ చేశారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. అక్కడితో టీడీపీ పతనం స్టార్ట్ అవ్వడం, చంద్రబాబు అమరావతి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఓటుకు నోటు సమయంలో స్టీఫెన్‌సన్‌ తన వద్దకు బేరసారాలకు వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు అందించి, వారిని పట్టుకునేందుకు అనువుగా వ్యవహరించారు.

అప్పుడు సహకరించినందుకు స్టీఫెన్‌సన్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నజరానా ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడిగా మరోసారి స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. (ప్రస్తుతానికి తెలంగాణాలో మంత్రివర్గం అంటే ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి మహమూద్ అలీ మాత్రమే). ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు పంపింది. మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు 17నే ఆయన మళ్ళీ ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు.

తెలంగాణ శాసనసభ వాస్తవ బలం 120. ఇందులో 119 మంది ఎన్నికల ద్వారా వస్తారు. మిగిలిన స్థానంలో ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిని క్యాబినెట్ సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు. స్టీఫెన్‌సన్‌ ఎంపికతో తెరాస బలం 91కి చేరుతుంది. ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడికి ఎమ్మెల్యేలతో సమానంగా అవకాశాలుంటాయి. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేయవచ్చు. మరోవైపు క్యాబినెట్ విస్తరణ మీద కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 18న క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.