Elest company Invests 24000cr in telanganaతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు నిధుల వరదలా ప్రవహిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో నిధులు ప్రవహిస్తుంటే, ఏపీకి అప్పుల రూపంలో నిధులు ప్రవహిస్తున్నాయి. అంతే తేడా! ఏపీ ప్రభుత్వం లిక్కర్ బాండ్స్ వేలం ద్వారా రూ.2,000 సేకరించాలనుకొంటే ఏకంగా రూ.8,000 కోట్లు రావడమే ఇందుకు తాజా నిదర్శనం.

ఇక తెలంగాణలో రూ. 2-300 కోట్ల పెట్టుబడులు తరచూ వస్తూనే ఉంటాయి. కానీ నిన్న ఏకంగా రూ. 24,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసస్ రూ.20,761 కోట్లు పెట్టుబడితో దేశంలో కెల్లా అతిపెద్ద డాటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫార్ట్యూన్ 500 కంపెనీలలో ఒకటైన ఎలెస్ట్ ఇప్పుడు రూ.24,000 కోట్లు పెట్టుబడితో దుండిగల్‌ ఇండస్ట్రియల్ పార్క్‌లో స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్స్, మొబైల్ ఫోన్లకు అవసరమైన ఆమోలెడ్ డిస్‌ప్లే యూనిట్లను తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. భారతదేశంలో అమెలెడ్ స్క్రీన్లు తయారుచేయబోయే అతిపెద్ద ఇదే.

దానిలో శాస్త్రవేత్తలు, నిపుణులకు కలిపి మొత్తం 5,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ఆ సంస్థ అధినేత రాజేష్ మెహతా చెప్పారు. ఆదివారం బెంగళూరులో ఎలెస్ట్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాజేష్ మెహతా ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఒక ఏడాది వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి రూ.200-300-500-1000 కోట్ల పెట్టుబడులన్నిటినీ కలిపితే సుమారు 12-15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు కంపెనీల పెట్టుబడలు రూ.44,761 కోట్లతో కలిపితే సుమారు రూ.70,000 కోట్లు పైనే అయ్యింది.

తెలంగాణకు పెట్టుబడుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, ఏపీలో వారం తిరిగేసరికి సంక్షేమ పధకాలకు కనీసం రూ.300-650 కోట్లు పప్పు బెల్లాలగా ప్రభుత్వం పంచిపెడుతోంది. దాని కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అయినకాడికి అమ్మేస్తోంది. కేంద్రానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రతిగా వేలకోట్ల అప్పులు తెచ్చుకొంటోంది. ఇవి సరిపోవన్నట్లు తాజాగా లిక్కర్ బాండ్లు అమ్ముకొని రూ.8,000 కోట్లు అప్పు ప్రజల నెత్తిన పెట్టింది.

జగన్ ప్రభుత్వం ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలను మాత్రం తీసుకురాలేకపోయినా మద్యంపై ఏపీ ప్రభుత్వ విధానం చాలా ప్రోత్సాహకరంగా ఉండటంతో ప్రభుత్వం కేవలం రూ.2,000 ఆశిస్తే ఏకంగా రూ.8,000 కోట్లు వచ్చాయి. సంపూర్ణ మద్య నిషేదం అమలుచేస్తానన్న జగన్ ప్రభుత్వం జారీ చేసిన లిక్కర్ బాండ్లకు రూ.8,000 కోట్లు రావడం గొప్ప విశేషమే కదా?