electricity charges hike in apపేదవాడు సినిమా చూడలేకపోతున్నాడని ఎప్పుడో నెలకో, రెండు నెలలకో సినిమా చూసే టికెట్ ధరను 5 రూపాయల కనీస ధరకు తగ్గించిన జగన్ సర్కార్, అతి త్వరలో అదే పేదవాడి పొట్ట కొట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే అది ఎప్పుడో రెండు, మూడు నెలలకోసారి చూసే సినిమా టికెట్ ధరల విషయంలో కాదు.

ప్రజా జీవనాడిగా మారిన విద్యుత్ ఛార్జీలను పెంచుతూ జగన్ సర్కార్ అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి ధృవీకరించారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపధ్యంలో… కొత్త ఆర్ధిక సంవత్సరం నుండి ఈ బాదుడుకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

గృహ విద్యుత్ చార్జీలలో కనీస ధర గత 20 సంవత్సరాలుగా పెంచలేదట, మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు – విద్యుత్ సంస్థల ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఈ చార్జీల పెంపు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే వివిధ రకాల పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తోన్న జగన్ సర్కార్, విద్యుత్ చార్జీలను పెంపు రూపంలో మరో గుదిబండను ప్రజల నెత్తిపై పెట్టేందుకు సిద్ధమవుతోందన్న మాట.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు, రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేయగా, అదే “వైఎస్సార్ ఆశయ సాధన” పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్, నేడు వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం గమనించదగ్గ విషయం. రాష్ట్ర విభజనకు ముందు వరకు కరెంట్ కోతలు చవిచూసిన ఏపీ ప్రజలకు, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చంద్రబాబు విద్యుత్ కష్టాలను తీర్చారు.

ఆ ఐదేళ్లు కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా విద్యుత్ కోతలంటే తెలియని విధంగా ఏపీ ఉండగా, గడిచిన రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. ఇపుడు దానికి తోడు ఛార్జీల పెంపు అంటే… ఎవరి లబ్ది కోసం ఈ చార్జీల పెంపు అన్న ఆలోచనలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే గడిచిన రెండేళ్ళల్లో భారీ భారీ పరిశ్రమేలేవీ వచ్చి విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది లేదు.

ఇంకా చెప్పాలంటే ఉన్న పరిశ్రమలే వెనక్కి వెళ్లిన పరిస్థితి నెలకొంది. అలాగే కరోనా వలన చిన్న చిన్న పరిశ్రమలు కూడా భారీ సంఖ్యలో మూతపడ్డాయి. ఇక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా నిద్రావస్థలో ఉండడం, ఇసుక కొరతతో మునుపటి స్థాయిలో గృహ నిర్మాణాలు గానీ, భారీ సంఖ్యలో ప్రభుత్వం పేదలకు కట్టించి ఇచ్చిన గృహాలు దాఖలాలు లేవు.

గత 20 ఏళ్లుగా పెంచలేదని ఇప్పుడు పెంచడమే అసలు కారణం అయితే దానిని ప్రశ్నించడం ప్రతిపక్షాల వలన కూడా కాదేమో! ఓ పక్కన కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతుంటే, పన్నుల మీద పన్నులు… బాదుడు మీద బాదుడు… ప్రజలపై మోపడం బహుశా దేశంలో జగన్ సర్కార్ మాత్రమే అనుసరిస్తున్నారేమో అన్న విధంగా ఏపీ పరిస్థితి మారుతోంది.