Elections 2019- Chandrababu Naidu, Jagan, and Pawan Kalyan-ఏడాది లోపే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. గెలుపుకోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్న అన్ని ప్రధాన పార్టీలలోనూ ఏదో బెరుకు, అయోమయం. ఓటరుదేవుళ్ళు గుంభనంగా ఉండటంతో వారు మరింత ఒత్తిడికి గురిఅవుతున్నారు.

తెలుగు దేశం పార్టీ గెలుపు పై ఒక వైపు నమ్మకంగా ఉన్నా, బీజేపీతో తెగతెంపులు చేస్కుకోవడంలో ఆలస్యం చేసి ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చామేమో అనే సంశయం వెంటాడుతుంది. పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చెయ్యడంతో ఆ మేరకు ప్రభావం కాపుల మీద ఉంటుందా లేదా అనేదాని మీద ఇప్పటికే కొన్ని సర్వేలు చేయిస్తుందట.

అయితే అన్ని పార్టీలు ఒక్కటయ్యి టీడీపీని ఇబ్బంది పెడుతున్న విషయం ప్రజలు గ్రహిస్తున్నారని వారు మద్దతుగా నిలుస్తారని టీడీపీ అంచనా. వైకాపాకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఒకవేళ ఓడిపోతే పార్టీ 2024 నాటికి పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోతుందని జగన్ కు బాగా తెలుసు. అయితే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపైన పూర్తిగా ఆధారపడిపోతున్నాం అని ఆ పార్టీ నాయకులే భావిస్తున్నారు.

జగన్ కేసులవల్ల బీజేపీపై గట్టిగా మాట్లాడలేకపోవడం ఇబ్బంది అవుతుందేమో అని కూడా భయపడుతున్నారు. మరోవైపు జనసేనది విచిత్ర సమస్య. ప్రజారాజ్యం అనుభవాలతో పవన్ కళ్యాణ్ సభలకు యాత్రలకు ఎక్కువగా ప్రజలు వస్తున్న వారు ఓట్లు వేస్తారో లేదో అనుమానం. ముక్కోణపు పోటీలో కనీసం కింగ్ మేకర్ గా అయినా అవ్వాలని భావిస్తున్నారు.

బీజేపీ నాయకుల డాంబికాలకు ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బలానికి అసలు సంబంధమే లేదు. అయినా అన్ని రాష్ట్రాలలోను గెలిపిస్తున్న మోడీ వేవ్ ఆంధ్రప్రదేశ్ లోకూడా గెలిపిస్తుందని వారి విశ్వాసం. అయితే ఒకవేళ కేంద్రంలో సరైన మెజారిటీ రాకపోతే రాష్ట్రంలోని పరిణామాలు ఎలా ఉంటాయో అని వారి అనుమానం. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అయితే ఏదోలా నాలుగు సీట్లు తెచ్చుకుంటే చాలు అన్నట్టు ఉన్నాయి.