election-survey-tdp-clean-sweep-2019రాజకీయాలలో సర్వేలు సర్వ సాధారణం. ప్రజలలో పార్టీల బలాబలాలు ఏమిటో తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఆ క్రమంలోనే తాజాగా ఓ మీడియా సంస్థ సర్వేల స్పెషలిస్ట్ అయిన ‘ఫ్లాష్ టీం’తో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని వర్తమాన రాజకీయాలపై నిర్వహించిన సర్వే ఫలితాలు ఏపీలో హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఈ సర్వేలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఊహించదగినదే అయినా… ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంతకంతకూ దిగజారడం ఆసక్తికర పరిణామంగా మారింది.

ఇప్పటికిప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నకు టిడిపి + బిజెపిలు కలిసి పోటీ చేస్తే 120 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకుంటుండగా, 50 స్థానాలను వైసీపీ హస్తగతం చేసుకోనుందని తేలింది. ఒకవేళ టిడిపి, బిజెపిలు కలిసి కాకుండా… విడివిడిగా పోటీ చేసినట్లయితే టిడిపి మెజారిటీ 140 స్థానాలకు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నది సర్వే సారాంశం. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 30 స్థానాలకే పరిమితం అవుతుందంటూ తేల్చింది.

బిజెపితో విడిపోయినట్లయితే ముస్లిం, క్రిస్టియన్ ల ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారి, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుతోందని అందించిన సమాచారం. ఇక ఓటింగ్ శాతాల విషయానికి వస్తే… టిడిపి + బిజెపి కలిసి పోటీచేస్తే దాదాపు 46 శాతానికి పైగా మద్దతు పలుకుతుండగా, వైసీపీ కేవలం 36 శాతానికి పరిమితం అవుతుండగా, కాంగ్రెస్ 6 శాతంతో సరిపెట్టుకుంటోంది. అలాగే టిడిపి, బిజెపిలు విడివిడిగా పోటీచేసినా టిడిపి, వైసీపీల ఓటింగ్ శాతాలలో వ్యత్యాసం లేదు గానీ, బిజెపికి 3 శాతం, జనసేనకు 4 శాతం, కాంగ్రెస్ కు 3 శాతం దక్కే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుపై 46 శాతం మంది బాగుందని చెప్పగా, 22 మంది పెదవి విరిచారు. అలాగే మరో 34 శాతం మంది పర్వాలేదనే సమాధానం ఇచ్చారు. ఇదే జగన్ విషయంలో 34 శాతం బాగుందని, 32 శాతం బాగోలేదని, 34 శాతం మంది పర్వాలేదని అన్నారు. ఇక, ఏపీ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఈ రేషియో 48 : 52గా ఉండడం గమనించదగ్గ విషయం. అంటే ప్రస్తుత పవన్ తీరుతో బాగోలేదని విభేదించే వారే ఎక్కువగా ఉండడం ఊహించని పరిణామమే.

అయితే టిడిపి అనుకూల మీడియా సంస్థ నిర్వహించిన సర్వే కావడంతో, సహజంగానే వైసీపీ వర్గాలు ఈ సర్వే వివరాలు తప్పంటూ కొట్టిపడేస్తున్నాయి. కానీ, ఈ సర్వేకు ప్రాధాన్యతను కల్పించింది మాత్రం ‘ఫ్లాష్ టీం’ అనే చెప్పాలి. గతంలో లగడపాటి రాజగోపాల్ కు సర్వేలు చేపట్టిన సంస్థ కావడంతో, ప్రజలలో విశ్వాసాన్ని ఏర్పడేలా చేస్తోంది. ‘ఆంధ్రా ఆక్టోపస్’గా లగడపాటి సర్వేలకు ఉన్న విలువ రాజకీయ విజ్ఞులకు తెలిసిందే. మరి ఈ సర్వే వివరాలపై జనాలు ఏమనుకుంటున్నారో..?!