election-commissioner of andhra pradesh ramesh kumarకేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు తన, తన కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌‌ రాసినట్టుగా చెప్పబడిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకూ ఆయన మీడియా ముందుకు వచ్చి ఆ లేఖ తనదేనని ధృవీకరించలేదు.

ఇది ఇలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రమేష్‌కుమార్‌‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం నిఘా పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేరింది.

మరోవైపు…. రమేష్ కుమార్ రాశాడు అని చెప్పబడుతున్న లేఖని ఒక వర్గం మీడియా అతిగా ప్రచారం చేసి ప్రభుత్వం పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగిస్తుందని.. లేఖ వ్యవహారంపై సీఎం జగన్, డీజీపీ సవాంగ్, ఐబీ చీఫ్ మనీష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ లేఖ ఎవరి ద్వారా వెళ్లింది.. వాస్తవమేనా.. లేదా.. అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న లేఖపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. లేఖలో ఉన్నటువంటి భాష, విషయాలు అధికారిక లేఖ లాగానే ఉండటంతో ప్రభుత్వం ఉత్కంఠలో ఉంది. దీనితో తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రమేష్ కుమార్ కు భద్రత పెంచారు.