Election Commissioner of Andhra Pradeshకడప జిల్లా కోడూరు నియోజకవర్గంలోని దేవమాచుపల్లి పోలింగ్‌ బూత్‌ నంబరు-21లో పురుష ఓటర్లు 337 మంది ఉండగా..370 ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికెట్ ద్వారా తేలడంతో అక్కడ రిగ్గింగ్ జరిగిందని, రిపోలింగ్ కు ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎన్నికల సంఘం వివరణ చాలా గమ్మత్తుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అంత బాధ్యతాయుతంగా జరిగాయో అర్ధం పడుతుంది.

టీడీపీ చేసిన ఫిర్యాదుపై కలెక్టర్‌ను వివరణ కోరగా.. టైపింగ్‌ తప్పు జరిగిందని ఆయన పేర్కొన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఫారం – 17 అనేది పోలింగ్ తరువాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది లెక్క తేల్చి పార్టీల ఏజెంట్ల సమక్షంలో సంతకాలు పెడతారు రిటర్నింగ్ ఆఫీసర్. కౌంటింగ్ రోజున ఆ లెక్క ఈవీఎంలలోని లెక్క తో సరిపోవాలి. దీని బట్టి స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు భద్రంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది.

ఇటువంటి కీలకమైన విషయంలో సింపుల్ గా టైపింగ్‌ తప్పు అని చెప్పేసారంటే ఎన్నికల కమిషన్ పని తీరు మీదే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ టైపింగ్‌ తప్పు నిజమే అనుకున్నా 109.8% పోలింగ్ అయ్యింది అని రాసి ఉన్న దస్త్రం మీద సదరు రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా సంతకం పెట్టారు. దీనికి బాధ్యుల మీద ఎన్నికల సంఘం ఏం యాక్షన్ తీసుకున్నట్టు? ఇటువంటి తప్పిదాలు ఎన్నికల సంఘం మీద ప్రజలకు రాజకీయ నాయకులకు అనుమానాలు కలిగిస్తున్నాయంటే కాదనలేని పరిస్థితి.