Nimmagadda Ramesh Kumar Election Commissionerఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అన్ని రకాల అనర్ధాలు జరుగుతున్నాయి. అసాధారణ రీతిలో జరిగిన గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలని పరిశీలించేవరకూ ధృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. దానితో మంత్రులు చెలరేగిపోయారు. నిమ్మగడ్డ ఆదేశాలను పాటించవద్దని సూచించారు.

జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను మంత్రి హెచ్చరించారు. ‘మీ అందరికీ మీడియా ముఖంగా చెబుతున్నా… జాగ్రత్తగా ఉండండి. ఏ అధికారి అయినా ఎస్‌ఈసీ మాటలు వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అని అనుకుంటే గుణపాఠం తప్పదు. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని సూచిస్తున్నా. ఇవ్వకపోతే… పేరు పేరునా గుర్తు పెట్టుకొని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఏ అధికారి కూడా నిమ్మగడ్డను గౌరవించి పని చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.

దీనికి ప్రతిగా ఆయనను ఎన్నికల తతంగం ముగిసేవరకు ఇంటికే పరిమితం చెయ్యాలని… మీడియా ముందుకు రానివ్వొద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించారు. ఆదేశాలను ధిక్కరించి సాక్షి తో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి నిమ్మగడ్డను చంద్రబాబు ఇంటి కాపలా కుక్కలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆయన ఏదో దేశానికీ రాష్ట్రపతి అంటూ ఊహించుకుని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వికృతరూపం దాల్చుతున్నాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అధికారపక్షం ఏ మాత్రం సంయమనం పాటించినా ఈ పరిస్థితి తలెత్తేది కాదు.