Jagan Government Intentionally Deferring Corona Shutdown?ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష వైఖరిపై గవర్నర్ కు కంప్లయింట్ చేశారు. ఆ తరువాత జగన్ మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏకంగా ఆయన మీద కులపరంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రమేశ్ కుమార్‌ తాము నియమించిన వ్యక్తి కాదని.. చంద్రబాబు హయాంలోనే నియమించారన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారులను ట్రాన్సఫర్ చెయ్యడం, ఎన్నికలు వాయిదా వెయ్యడంపై విరుచుకుపడ్డారు.

ఈసీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఈసీకి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్పాషికత అని.. రమేశ్ విచక్షణ కూడా కోల్పోయినట్లుగా ప్రవర్తించారన్నారు. “అసలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆపడానికి ఈయన ఎవరు? కేవలం ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక ఎన్నికలలో విజయాలు సాధిస్తుంది అనే కారణంగానే ఎన్నికలు వాయిదా వేశారు,” అని జగన్ ఆరోపించారు.

ప్రజలు ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే తాము అధికారంలో ఉన్నామని.. అధికారం జగన్‌ మోహన్‌రెడ్డిదా.. లేదా రమేశ్ కుమార్‌దా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఏమన్నా అంటే విచక్షణ అధికారం అంటారని.. ఈ మధ్య ఇదో ఫ్యాషనైపోయిందన్నారు. ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ఎందుకన్నారు. జగన్ ప్రెస్ మీట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిందిగా లేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఎందుకు ఎన్నికల వాయిదా పై అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు?