election-commission-on-screening-lakshmis-ntr-in-kadapaరామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1న విడుదల చెయ్యాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. చిత్రం విడుదలను ఎన్నికల సంఘం చివరి నిముషంలో అడ్డుకుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారు. ఆరోజు ఉదయం షోలో ప్రదర్శించి జిల్లా అధికారులు అదేమి అని అడిగితే ఎన్నికల సంఘం బ్యాన్ గురించి తమకు తెలియదన్నారు. ఆ రెండు థియేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలమైన వారు నడుపుచున్నవని సమాచారం.

అయితే దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర సీఈసీకి సిఫార్స్ చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ చెప్పారు. అదే సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను బేఖాతరు చేసిన ఆ థియేటర్‌ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దీనితో ఆ రెండు థియేటర్ల యాజమాన్యం తమ జగన్ భక్తికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మే 23 వరకూ విడుదల అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే ఆ చిత్రం ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని చోట్లా విడుదల అయ్యింది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అది టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా. లక్ష్మి పార్వతి చెప్పినట్టు తియ్యడం వల్ల ఈ సినిమాలో చంద్రబాబు, నందమూరి కుటుంబం విలన్లు గా చూపించారు వర్మ.