Election Commission banned volunteers from election duties    వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వం నేరుగా ఆర్ధికసాయం అందజేయలేదు కనుక వాలంటీర్ వ్యవస్థను సృష్టించి నెలనెలా రూ.5,000 గౌరవ వేతనం చెల్లిస్తోంది. కనుక వారిని అన్ని రకాలసేవలకు ఉపయోగించుకొంటోంది. వారు వైసీపీ కార్యకర్తలని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెపుతుండటంతో, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌ మీనా సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇక నుంచి జరుగబోయే ఏ ఎన్నికల ప్రక్రియలోను వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకోరాదని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వాలంటీర్లతో ఓటర్ల నమోదు, జాబితా తయారీ, దానిలో మార్పులు చేర్పులు, ఎన్నికల సమయంలో ఓటర్ చీటీల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపులో వైసీపీ ఏజంట్లుగా వ్యవహరించడం వంటి అన్ని పనులకు వారిని దూరంగా ఉంచాలని ఉత్తర్వులలో ఆదేశించారు. ఎన్నికలకు సంబందించి ఎటువంటి పనులలో వాలంటీర్లు పాల్గొనరాదని, ఆ విదంగా చేస్తే నిబందనలు ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలో అన్ని జిల్లాలలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించేవారు ఖచ్చితంగా అమలుచేయాలని ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశించారు.

ఇది వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. గత మూడేళ్ళుగా గ్రామ, వార్డు స్థాయిలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంక్షేమ పధకాలు అందజేస్తుండటంతో ప్రజలు వారిని అభిమానిస్తున్నారు. కనుక ఎన్నికల సమయంలో వారు తమ పరిధిలో ప్రజలకు నచ్చజెప్పి వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించగలరు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారం కంటే వాలంటీర్ల ప్రభావమే లబ్దిదారులపై ఎక్కువగా ఉంటుంది. కనుక రాబోయే ఎన్నికలలో వారు వైసీపీకి చాలా కీలకం కానున్నారు. కానీ ఎన్నికల సంఘం వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆదేశించడం వైసీపీ పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.

ఇదివరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఆగ్రహించిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను పదవిలో తొలగించడం, ఆయన స్థానంలో జస్టిస్ వి.కనగరాజ్‌ను నియమించడం, అప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసి మళ్ళీ నిమ్మగడ్డను నియమించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ముఖేష్ కుమార్‌ మీనా విషయంలో కూడా అదే తంతు పునరావృతం అవుతుందేమో?