ED Raids On Gudivada Casino Mastermindఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) బృందాలు బుదవారం హైదరాబాద్‌లో క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్ రెడ్డి, దాసరి మాధవరెడ్డి అలియాస్ ముక్కు మాధవరెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అర్దరాత్రి వరకు తనికీలు చేసి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకొన్నారు.

వారిరువురూ నేపాల్‌లోని మోచీనగర్‌లో హోటల్‌ మోచీక్రౌన్‌లో గత నెల 10 నుంచి 13వరకు నాలుగు రోజులపాటు క్యాసినో నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఒక్కొక్కరు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించి వెళ్ళారు.

వారందరినీ హైదరాబాద్‌ నుంచి విమానంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి జిల్లాలో బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేపాల్‌లోని హోటల్‌కు తీసుకువెళ్లారు. నాలుగు రోజుల క్యాసినోలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆ జూదంలో గెలుచుకొన్న సొమ్మును హవాలా ద్వారా విజేతలకు అందజేసినట్లు ఈడీ అధికారులు గుర్తించి ఈ దాడులు చేశారు.

క్యాసినో నిర్వాహకులిద్దరికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిలో చికోటి ప్రవీణ్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారు. దానికి మాజీ మంత్రి కొడాలి నాని స్పాన్సర్ అని, మూడు రోజుల పాటు సాగిన క్యాసినోలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారని, దానిలో సుమారు రూ.200-250 కోట్లు చేతులు మారాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కనుక ఈడీ అధికారులు హైదరాబాద్‌లో లభించిన ఆధారాలతో ఇప్పుడు గుడివాడలో జరిగిన క్యాసినో గురించి ఆరాలు తీయడం సహజం. కనుక గుడివాడలో నిర్వహించిన క్యాసినోలో ఒకవేళ కొడాలి నాని ఉన్నట్లయితే, నేడో రేపో ఈడీ అధికారులు ఆయన ఇంటి తలుపు తట్టవచ్చు. అప్పుడు ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో?