Jagan gets a call from ED Special Courtవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమాస్తులకు సంబంధించి జగన్ పై సీబీఐ 11 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులపై ఇప్పటికే నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో చార్జిషీట్ ను ఆర్థిక నేరాల కోర్టులో దాఖలు చేసింది. దీంతో జగన్ పై దాఖలైన చార్జిషీట్ల సంఖ్య 11 నుంచి 12కు పెరిగినట్లైంది.

ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ విషయానికొస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాంకీ సంస్థలకు 134 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తూ నాటి ప్రభుత్వం వ్యవహరించింది. అందుకు ప్రతిగా జగన్ సంస్థ జగతి పబ్లికేషన్ లో రాంకీ సంస్థ 10 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ తో పాటు ఆడిటర్ విజయసాయిరెడ్డి, రాంకీ సంస్థ అధినేత అయోధ్యరామిరెడ్డి తదితరుల పేర్లను కూడా ఈడీ అధికారులు చార్జిషీట్ లో చేర్చారు.