ED attaches 149 crores of YS Jagan Assetsరాజకీయ సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ చేరిక తర్వాత, గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశాల తర్వాత అధినేత జగన్ మోహన్ రెడ్డిలోనూ, కార్యకర్తలలోనూ నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. అదే ఊపులో తాజాగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పార్టీలో చేర్చుకుని ఎంతో కొంత ప్రజల్లో పాజిటివ్ సంకేతాలను వైఎస్ జగన్ చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఓ పక్కన కాస్త చెప్పుకోవడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే… మరో పక్కన తన అక్రమాస్తుల కేసులో జరుగుతున్న పరిణామాలతో తల పట్టుకోవడం జగన్ వంతవుతోంది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో 148.89 కోట్ల విలువైన భూములను అటాచ్ చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. మొత్తం ఈ అక్రమాస్తుల కేసులో 12 చార్జ్ షీట్లు దాఖలు చేయగా, అందులో తాజా ఈ చార్జిషీట్ తో సహా తొమ్మిదింటిలో ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా చార్జిషీట్ లో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన భూములను అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం అయితే వెలువడింది గానీ, పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఏది ఏమైనా ఈ పరిణామాలను జగన్ సమర్ధించుకునే దశలో అయితే లేరు. ఇప్పుడిప్పుడే పార్టీపై ప్రజలలో భావన సడలుతోంది అన్న తరుణంలో… మళ్ళీ ఏదొకటి కొత్తగా తెరపైకి రావడం, జగన్ అక్రమాస్తుల భాగోతాలు వెలుగు చూడడంతోనే సరిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు జగన్ వీటిపై సమాధానం చెప్పకపోయినప్పటికీ, రేపు ఎన్నికల సమయం నాటికైనా దీనిపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంతైనా మాట్లాడతారు గానీ, తన అక్రమాస్తుల కేసులపై మాత్రం జగన్ ప్రస్తావించరన్న విషయం తెలిసిందే.