ఇది అనూహ్య పరిణామం అనొచ్చు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షపార్టీలోకి మారి…ఉపఎన్నికలో నువ్వానేనా అన్నట్లు పోరాడిన ఈటల రాజేందర్ కే జై కొట్టారు హుజురాబాద్ ప్రజలు. వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పై భారీ విజయం సాధించారు. టీఆరెస్ వర్సెస్ బీజేపీ గా జరిగింది ఈ ఉపపోరు అంటే అంగీకరించలేన పరిస్థితి. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఎన్నిక సాగింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈటల గెలవటానికి వీళ్లేదని….శతవిధాల ప్రయత్నాలు చేసింది అధికారపార్టీ. హుజురాబాద్ లో అఖిలపక్ష నేతలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి, టీడీపీ నుంచి రమణతోపాటు స్థానికంగా ఎన్న ఎంతో మంది నేతలకు గులాబీ తీర్థం అందించి పదవులు ప్రకటించారు.

ఇక అధికార పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రటించినా…బాధ్యతలు మాత్రం మంత్రి హరీశ్ రావు తీసుకున్నారు. తానే అభ్యర్థి అన్నట్లుగా హోరాహోరీగా ప్రచారం చేశారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి లాంటి బడా నేతే ఓడిపోయారు…ఆయన కంటే ఈటల పెద్ద నేతనా అంటూ ప్రశ్నించారు. దళితులను అక్కున చేర్చుకుంటున్నామంటూ దళితబంధు పథకంను పైలైట్ ప్రాజెక్ట్ గా తీసుకువచ్చారు. అది హుజురాబాద్ కోసం కాదని పలసార్లు చెప్పారు. కానీ ఆ పథకం అమలు చేసిన గ్రామంలోనూ బీజేపీ సత్తా చాటింది. హుజురాబాద్ లో 2001 నుంచి 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్…టీఆరెస్ అభ్యర్థిగా కేసీఆర్ అవకాశం ఇస్తేనే విజయం సాధించారు. కానీ ఈ సారి మాత్రం ప్రతిపక్షపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచారు. టీఆరెస్ పార్టీని ఏనాడైతే వీడారో…అనాటి నుంచే ప్రచారం ప్రారంభించారు. 6సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ వచ్చారు ఈటల.

నియోజకవర్గ ప్రజలకు తన పరిస్థితిని వివరించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అధికార పార్టీ శక్తియుక్తుల గురించి తన నియోజకవర్గ ప్రజలకు క్లుప్తంగా వివరించుకుంటూ వచ్చారు. పార్టీ మారినా…ప్రజల్లో తనకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయలు, వారి కోసం చేసిన పనులు..అవసరమైతే మీకు అండగా నిలుస్తానన్న నమ్మకాన్ని నెలబెట్టుకున్నారు రాజేందర్. ఆవిధంగానే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఈటలకు అండగా నిలిచారు. వెన్నుతట్టి ముందుకు నడిపించారు. హుజురాబాద్ లో తమ పార్టీ గెలుపు ఖాయమని..అన్ని సర్వేలు అదే చెబుతున్నాయంటూ టీఆరెస్ నేతలు చెబుతూ వచ్చారు. అయినా రాజేందర్ జంకలేదు. పోరాటం వదల్లేదు. ఆస్తులు పోయినా పర్లేదు…లొంగేది మాత్రం లేదంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు ఈటలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేశారు. అంతేకాదు పార్టీ పరంగా బీజేపీ పైనా విమర్శలు వర్షం కురిపించారు.

ఈ ఉపఎన్నిక ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ రంగంలోకి దిగారు. బీజేపీ నుంచి కూడా నేతలు ప్రచారం చేశారు. కానీ అక్కడ బీజేపీ కన్నా ఈటల గెలిచారనేది వాస్తవమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటంగా ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు ముందు నిలిచారు. అయితే హుజురాబాద్ లో కాంగ్రెస్ పోటీలో ఉందా అనే విధంగా అనుమానాలు కలిగేలా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు కూడా రాజేందర్ కే పడ్డాయనేది కౌంటింగ్ ట్రెండ్స్ లో స్పష్టమైంది.

ఈటల ఈ గెలుపుతో ఏడోసారి అసెంబ్లీలో కాలు మోపనున్నారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు తర్వాత… బీజేపీకి ఈ విజయం కొత్త ఊపును ఇస్తోంది. వ్యక్తిగతంగా ఇది ఈటల సక్సెస్. కేసీఆర్ పైన ఈటల సాధించిన విజయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా అసెంబ్లీ వేదికగానూ…కేసీఆర్ సర్కార్ పైనా రాజేందర్ పోరాటం చేయాలి. దీంతో ఇఫ్పుడు బీజేపీలోనూ ఈటల గ్లామర్ పెరగనుంది. జాతీయ నాయకత్వం కూడా ఈటలను గుర్తించే విధంగా విజయం సాధించారు. ఈ ఉపఎన్నిక ఫలితంలో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి రావటం ఖాయమనే చర్చ వినిపిస్తోంది.