YS Jagan YSRCP east godavari districtగత సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాను తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పటికీ వైసీపీ తరపున జిల్లా అధ్యక్షులుగా కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి బలమైన నేతలు అండగా ఉన్నారు. అయితే తాజాగా టిడిపి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా ఆ జిల్లా అధ్యక్షులు కూడా దూరం కానున్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రకటన రాగా, తాజాగా ముహూర్తాన్ని కూడా ఖరారు చేసారు.

ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు. కాపు సామజిక వర్గ నేతగా జిల్లాలో కొత్తపల్లికి మంచి పట్టు ఉంది. అంత పట్టు ఉంది కాబట్టే, గతంలో ‘ప్రజారాజ్యం’ స్థాపించిన సమయంలో స్వయంగా చిరంజీవి విచ్చేసి మరీ కొత్తపల్లిని ఆహ్వానించి తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఆ తర్వాత జగన్ చెంత చేరి గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయినప్పటికీ కాపు సామజిక వర్గ నేతగా పలుకుబడి ఉండడంతో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వమన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కొత్తపల్లి. ఈ సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మంత్రులలో కొత్తపల్లి కూడా ఒకరు. తాజా మార్పుతో ప.గో.జిల్లాలో జగన్ పార్టీ పూర్తిగా ఖాళీ అవ్వడంతో… వైసీపీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.