Sajjala_Ramakrishna_Reddyవైసీపీ ప్రభుత్వ సలహాదారులలో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీలన్నీ కట్టకట్టుకొని వస్తున్నాయి. కానీ అవి ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకొంటే ఎన్నికలు జరుగవు. 2024లో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్ని పార్టీలు కట్టకట్టుకు వచ్చినా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వాటి తరం కాదు,” అని అన్నారు.

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలు జరగాలని, వాటిలో తాము గెలిచి అధికారంలోకి రావాలని కోరుకొంటుంటాయి. ఇది చాలా సహజం. కనుక ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఆవిదంగా కోరుకొంటున్నాయనుకోవచ్చు. అయితే ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అవి గట్టిగా నమ్ముతుండటానికి చాలా బలమైన కారణమే కనిపిస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ప్రతీ నెలా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షనర్లకి పెన్షన్లు చెల్లించలేక ఆపసోపాలు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక వైసీపీ ప్రభుత్వానికి నెలనెలా గండమే అన్నట్లు సాగుతోంది. జీతాలు, పెన్షన్లు మాత్రమే కాక సంక్షేమ పధకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం నెలనెలా వేలకోట్లు జనాలకు పంచిపెడుతోంది. కనుక వాటికీ నిధులు లేదా అప్పులు సమకూర్చుకోవడం నానాటికీ కష్టంగా మారుతోంది. కనుక ఈ పరిస్థితులలో వైసీపీ మరో ఏడాదిన్నరపాటు ప్రభుత్వాన్ని నడిపించడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. అందుకే ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలు అనివార్యమని గట్టిగా నమ్ముతున్నాయి.

ఒకవేళ సజ్జల చెపుతున్నట్లు వైసీపీ పదవీకాలం పూర్తయ్యేవరకు అధికారంలో కొనసాగితే అప్పటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఎక్కడా అప్పులు కూడా పుట్టకపోవచ్చు. అప్పుడు జీతాలు, పెన్షన్లు చెల్లించలేక, సంక్షేమ పధకాలని కొనసాగించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తే మొదటికే మోసం వస్తుంది. కనుక వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి.

ఒకవేళ సజ్జల లేదా ఆర్ధిక మంత్రి బుగ్గన ఈ సమస్యలకి సంతృప్తికరమైన సమాధానం చెప్పగలిగితే ముందస్తు ఎన్నికల గురించి ప్రతిపక్షాల వాదనలు తప్పని ఒప్పుకోవచ్చు.