Dyavudaa Trailer Public Talkకొత్త సంవత్సరం కానుకగా విడుదలైన “ద్యావుడా” అనే చిన్న సినిమా టీజర్, శైవ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ టీజర్ లో… శివలింగానికి మాంసాహారం ప్రసాదంగా పెట్టడం, అలాగే శివలింగానికి మద్యంతో అభిషేకం చేయించడం వంటి సన్నివేశాలు ఉండడంతో సంచలనాత్మకమైంది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు చిత్ర దర్శకుడు సాయిరామ్ ను అరెస్ట్ చేసి, కోర్టు విచారణ అనంతరం రిమాండ్ కు తరలించారు.

దర్శకుడితో పాటు నిర్మాత హరికుమార్ రెడ్డిపై కూడా కేసు నమోదు కాగా, అతను పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అరెస్ట్ అయిన దర్శకుడు సాయిరామ్ మాత్రం… తానూ తీసింది సరైనదేనని, ఉజ్జయిని దేవాలయాల్లో సిగరెట్లు, మద్యంతోనే శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉందని, వాటి నేపధ్యంలోనే ఆయా సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తమతో చెప్పారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది పక్కన పెడితే, ఇలాంటి సన్నివేశాలు ఖచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని చిత్ర దర్శకనిర్మాతలకు తెలియదా?

ఒక విధంగా పబ్లిసిటీ కోసమని ఇలాంటి చీప్ ట్రిక్స్ వినియోగించడం ఇటీవల కాలంలో షరామామూలుగా మారిపోయింది. సహజంగా ఈ సినిమా టీజర్ వైపు ఏ ఒక్కరూ చూసే పరిస్థితి లేదు. ఒకవేళ చూసినా ఖచ్చితంగా సినిమాకు వెళ్ళరని చెప్పవచ్చు. ఆ రేంజ్ లో ఈ “ద్యావుడా” టీజర్ ఉంది. అయితే అందరినీ ఆకర్షించేందుకు, ఈ టీజర్ చివర్లో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సన్నివేశాలు జోడించి వివాదాస్పదమయ్యారు. అందుకే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నారు అంటున్నారు ఆధ్యాత్మికవాదులు.