DVV-Danayya-response to rumours on ram charan ntr movieరాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి ఒక వార్త షికారు చేస్తోంది.

1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ అనే హిందీ సినిమాకి ఇది రీమేక్ అనేది ఆ వార్తలోని సారాంశం. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్… షారుక్ ఖాన్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అదే సినిమాను రాజమౌళి రీమేక్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో… నిర్మాత డీవీవీ దానయ్య స్పందించక తప్పలేదు.

“ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని” తెలిపారు. ఇటీవల ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన దానయ్య, ఈ మల్టీస్టారర్ ను దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని జరుగుతోన్న ప్రచారం తెలిసిందే. అయితే పుకార్లను నమ్మవద్దు… అన్నీ అధికారికంగా చెప్తాం… అంటున్నారు దానయ్య.