Om Sairam Productions Cheated, Om Sairam Productions FIlm Nagar, Om Sairam Productions Cheated Artists,Om Sairam Productions DV Siddhartha ‘సినిమా అవకాశాలు కల్పిస్తాం’ అనే పేరుతో ఎన్ని మోసాలు వినుంటాం. కృష్ణానగర్ కు వెళితే లెక్కలేనన్ని నిజజీవిత కధలు కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. ఆ సినీ మోసాల కధలలో తాజాగా మరో కధ వచ్చి చేరింది. ‘ఓం సాయిరాం ప్రొడక్షన్స్’ పేరుతో నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రాజేంద్ర అలియాస్ డీవీ సిద్ధార్థ్, ఫిలింనగర్ లోని అపోలో రోడ్డులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసాడు.

ఇక్కడితో మొదలైన కధలో ఒక రోజు పేపర్ ప్రకటన వచ్చింది. “ప్రేమ + స్నేహం = సంగీతం” పేరుతో జూన్ 19 నుంచి ఓ సినిమాను ప్రారంభిస్తున్నామని, ఇందుకు గానూ నటీనటులను కావాలని పేపర్ ప్రకటన వెలువడింది. సదరు ప్రకటన చూసిన మేడ్చల్ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్, తన ఇంట్లో సోదరి వివాహం కోసం దాచి ఉంచిన 4 లక్షలను దొంగచాటుగా తీసుకొచ్చి సిద్ధార్థకు ఇచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్, కిషోర్ లు మరో లక్ష రూపాయలు ఇచ్చారు.

మరో వైపు సినిమా ప్రారంభ తేదీ కూడా సమీపిస్తున్న తరుణంలో వెండితెరపై వెలిగిపోతామని ఊహల్లో తేలియాడుతున్న వారికి, సిద్ధార్ద్ షాక్ ఇచ్చాడు. మాయమాటలు చెప్పి, తప్పించుకున్న ప్రబుద్ధుడు, ఆ తర్వాత ఏకంగా కార్యాలయాన్ని ఎత్తివేసి మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసాడు. దీంతో విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళింది. సిద్ధార్ద్ రాసిచ్చిన బాండ్లను పట్టుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

అయితే అప్పుడు తెలిసింది ఏమిటంటే… ఇలాంటి యువకులే సిద్ధార్ద్ కే మరికొందరు బుక్కవ్వడం. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వెండితెరపైన వెలిగిపోదామని భావించిన ఆ యువకులు, సిద్ధార్ద్ చేసిన మోసానికి ప్రస్తుతం విలవిలలాడిపోతున్నారు. ఇలాంటి కధలు ఎన్నో ఉంటాయి. అయితే ఇప్పటికైనా అలాంటి మోసపూరితమైన ప్రకటనలను చూసి యువత ఆకర్షితులు కావద్దని పోలీసులు, ఇంట్లో పెద్దలు కోరుతున్నారు.