ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే మొదటి మూడు నాలుగేళ్ళు పాలన, అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టి ప్రజలలో మంచిపేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే 5 ఏళ్ళ తర్వాత జరుగబోయే ఎన్నికల గురిచి ఆలోచిస్తూ అప్పులు చేసి మరీ తమ ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న లబ్ధిదారులకు సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెడుతూనే ఉంది.
ఆ ఎన్నికలనాటికి రాష్ట్రంలో టిడిపి కనబడకుండా పూర్తిగా తుడిచిపెట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒకవేళ తమ ధాటికి టిడిపి తట్టుకొని నిలబడినా ఆ ఎన్నికలలో ఆ పార్టీ ముఖ్యనేతలను వారి నియోజకవర్గాలలోనే ఓడించేందుకు ప్రత్యేకంగా వ్యూహాలు రచించుకొని అమలుచేస్తోంది.
అయితే వైసీపీ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతోందని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో రుజువైంది. టిడిపిని దెబ్బ తీయబోతే సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మెడ పట్టుకొని బయటకు గెంటుకోవలసి వచ్చింది. పైగా వచ్చే ఎన్నికలలో వారితోనే వైసీపీ పోరాడవలసిరావడం కూడా ఆ దేవుడి స్క్రిప్టే అనుకోవలేమో.
తాజాగా వైసీపీకి టెక్కలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని టెక్కలిలో పునాదులతో సహా పెకలించివేయాలని భావించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ నియోజకవర్గంలో బలమైన యువనేతగా భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికలలో టెక్కలి నుంచి శాసనసభకు పోటీ చేస్తారని ప్రకటించారు.
“టెక్కలి నియోజకవర్గంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని భావిస్తున్నానని కనుక శ్రీనును మీ చేతుల్లో పెడుతున్నాను. ఆయనకు మీరందరూ అండగా ఉండాలని,” సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత టెక్కలి నియోజకవర్గంలో ఆయన బలోపేతం అయ్యేందుకు తగిన సహాయసహకారాలు అందజేశారు. అవసరమైన మంది మార్బలాన్ని కూడా అమర్చిపెట్టారు.
అయితే దువ్వాడ శ్రీనివాస్ ఏమి ఆలోచించుకొన్నారో తెలీదు కానీ వచ్చే ఎన్నికలలో తాను శాసనసభకు పోటీ చేయనని తన భార్య వాణి పోటీ చేస్తుందని ప్రకటించి వైసీపీ అధినేతకు, పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. బహుశః ఇది కూడా దేవుడి స్క్రిప్టేనేమో? టెక్కలిలో అచ్చన్నాయుడిని దెబ్బ తీద్దామని సిఎం జగన్మోహన్ రెడ్డి అనుకొంటే దేవుడు మరోలా అనుకొన్నట్లున్నాడు. అచ్చెన్నాయుడుపై పోటీ చేసి గెలవలేమనే సంగతి శ్రీనివాస్ చాలా త్వరగానే గ్రహించిన్నట్లున్నారు. అందుకే ఆ భ్రమలో నుంచి ఇంత త్వరగా బయటపడి రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తన భార్యను బరిలో దింపి, ఆమె అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయినా అంతగా బాధపడవలసిన అవసరం ఉండదని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారేమో?